NTV Telugu Site icon

AP Govt: వరద విధ్వంసం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న విజయవాడ..

Floods

Floods

AP Govt: వరద విధ్వంసం నుంచి విజయవాడ నగరం నెమ్మదిగా కోలుకుంటుంది. కాలనీల దగ్గర వరద నీరు తగ్గుతుంది. వరద నీరు పూర్తిగా పోవడానికి మరో రెండ్రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు, బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐదు రోజులుగా నగరంలో జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయింది. బుడమేరుకి కవులూరు దగ్గర పడిన మూడు గండ్లు పూడ్చే పనులు కొనసాగుతున్నాయి. ఇంకా వరద ముంపులోనే ఉన్న బుడమేరు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. వరదలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకు రావటంలో ట్రాక్టర్లు కీలంగా మారాయి.

Read Also: Bhadrachalam: 43 అడుగుల చేరువలో భద్రాచలం వద్ద గోదావరి..

అలాగే, విజయవాడలో వరదల కారణంగా పేరుకుపోయిన చెత్త, రోడ్లు శుద్ధి చేయడానికి పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలలో పని చేసే శానిటేషన్ సిబ్బంది విజయవాడకు చేరుకున్నారు. విశాఖలోని ఐదు జోన్లకు సంబంధించిన శానిటేషన్ సిబ్బంది ఇప్పటికే విజయవాడ మున్సిపల్ స్టేడియంకు వచ్చారు. వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన శానిటేషన్ సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. కాలువలు, రోడ్లు, భవనాలు శుద్ధి చేయడానికి కావలసిన పరికరాలతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి మున్సిపల్ కార్మికులు చేరుకున్నారు.

Read Also: Bhadrachalam: 43 అడుగుల చేరువలో భద్రాచలం వద్ద గోదావరి..

అలాగే, వరద ప్రభావిత ప్రాంతాలలోని నిరాశ్రయులకు అందజేసేందు కోసం అధికారులు పాలు, బిస్కెట్లు, వాటర్ సిద్ధం చేశారు. ఆహార పంపిణీలో లూటీలు జరగకుండా పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ఆహార పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అనేక వాహనాల్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి పాలు, బిస్కెట్, వాటర్ ప్యాకెట్ వాహనాలు చేరుకున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రత్యేక వాహనాల్లో ప్రతి వార్డుకు ఆహార పదార్థాలు అందేలా చర్యలు చేపట్టిన అధికారులు.. సహాయక చర్యలకు వర్షం ఆటంకం కలిగిస్తుంది.