Vijayasai Reddy Counter On Bharat Jodo Padayatra: రాజకీయంగా బీజేపీ ఆల్రెడీ ఫుల్ దూకుడుమీదున్న సంగతి తెలిసిందే! వివిధ రకాల కార్యక్రమాలు, పాదయాత్రలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జోరుకి అడ్డుకట్ట వేసి, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ కూడా సరికొత్త వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టేందుకు సిద్ధమైంది. బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తోందని, భారత్‌ను ఐక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని చెబుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్రకు రెడీ అయ్యారు. కన్యాకుమారి ఉంచి కశ్మీర్ వరకు.. 12 రాష్ట్రాల గుండా మొత్తం 3,500 కి.మీ. మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. సెప్టెంబరు 7వ తేదీ నుంచి ఈ యాత్ర షురూ కానుంది.
ఈ క్రమంలోనే ఈ యాత్రపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ చేపడుతున్న ఈ భారత్ జోడో యాత్ర.. ప్రజల్ని తప్పుదోవ పట్టించేదిగా ఉందని అన్నారు. నెహ్రూ కుటుంబం ఎన్నికల్లో గెలవలేనంత మాత్రాన భారత్ విచ్ఛిన్నమైందని కాదని.. భారత్ ఎప్పుడూ విచ్ఛిన్నం కాలేదు, ఇప్పుడు విచ్ఛిన్నంగా లేదు, ఇకపై కూడా విచ్ఛిన్నం కాబోదని అన్నారు. ‘‘ఈ పాదయాత్ర విషయంలో కాంగ్రెస్‌ను నేను ఇచ్చే సలహా ఒక్కటే.. భారత్ జోడో యాత్రకి బదులు, ‘మృత్యువుకు ముందు తుదిశ్వాస’ అని ఈ యాత్రకి పేరు మార్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం’’ అని విజయసాయి రెడ్డి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంతకుముందు విజయసాయి రెడ్డి గణేశ్ చతుర్థు సందర్భంగా.. ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని అడ్డంకుల్ని తొలగించి.. సరైన నిర్ణయాలు తీసుకునేలా జ్ఞానం, తెలివితేటల్ని ఆ విగ్నేశ్వరుడు ప్రసాదించాలని కోరుతూ ట్వీట్ చేశారు.
