Site icon NTV Telugu

Milk Prices: సామాన్యుడికి మరో షాక్.. నవంబర్ 1 నుంచి విజయ పాల ధర పెంపు

Vijaya Milk Prices

Vijaya Milk Prices

Milk Prices: నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న సామాన్యుడికి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1 నుంచి విజయ పాల ధరలు పెరుగుతున్నాయి. ఈ మేరకు విజయ ఫుల్ క్రీమ్, గోల్డ్ పాల ధర లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటించింది. నవంబర్ 1 నుంచి నూతన ధరలు అమల్లోకి వస్తాయని కృష్ణా మిల్క్ యూనియన్ పేర్కొంది. ప్రస్తుతం విజయ ఫుల్ క్రీమ్ అర లీటర్ ప్యాకెట్ ధర రూ.34 ఉండగా రూ.35కి పెరగనుంది. విజయ గోల్డ్ ప్యాకెట్ అర లీటర్ ప్యాకెట్ ధర రూ.35 ఉండగా, రూ.36కి విక్రయిస్తామని తెలిపింది. రవాణా ఖర్చులు, ప్యాకింగ్ మెటీరియల్ ధర, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే పాల ధరలను పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ పేర్కొంది.

Read Also: GHMC : రికార్డు సృష్టించిన ఆస్తిపన్ను వసూళ్లు.. ఆరు నెలల్లో రూ.1,000 కోట్లు

కాగా పేద, మధ్యతరగతి వినియోగదారులు ఉపయోగించే లోఫ్యాట్(డీటీఎం), ఎకానమీ (టీఎం), ప్రీమియం (ఎస్‌టీడీ) పాల ధరల్లో ఎటువంటి మార్పు లేదని కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు తెలిపారు. పాలు, పాల పదార్థాలకు సంబంధించిన ముడిసరుకులకు ఇతర దేశాల నుంచి ఎక్కువ డిమాండ్‌ ఉందని.. దీంతో మన దేశంలో కొన్ని రాష్ట్రాల నుంచి సేకరిస్తున్న పాలు, పాల పదార్థాల ముడి సరకుల ధరలు పెరిగాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయ సంస్థకు చెందిన గోల్డ్‌, స్పెషల్‌ (ఎంఎం) ధరలు పెంచక తప్పలేదన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని ఆయన కోరారు.

Exit mobile version