ఒకప్పుడు గ్రంథాలయం లేని ఊరు, పట్టణం వుండేదికాదు. కాలక్రమేణ టెక్నాలజీ పెరిగిందనే సాకుతో గ్రంథాలయాలు కనిపించకుండా పోతున్నాయి. విజయవాడలో రామ్మోహన గ్రంధాలయ సందర్శనకు వచ్చిన ఉప రాష్ట్రపతి తాజా పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. గ్రంధాలయం, దేవాలయం, సేవాలయం ప్రతీ ఊరిలో ఉండాలి. రోజులు మారాక గ్రంధాలయాలు కనపడటం లేదు. గతంలో రామ్మోహన గ్రంధాలయంలో ఉపన్యసించే వాడిని.
పుస్తకం అందరి చేతిలో ఉండాలి. పుస్తకాలు చదవడం అందరూ అలవరుచుకోవాలన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఇక్కడికి రావటం ఆనందంగా ఉందన్నారు వెంకయ్య. అంతకుముందు రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన కోసం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శనివారం ఉదయం గన్నవరం చేరుకున్నారు. గోవా నుండి ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చారు.
ఆయనకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శాలువా కప్పి, పుష్ప గుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, డిజిపి గౌతం సవాంగ్ , రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తదితరులు స్వాగతం పలికారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రతిభ కనబర్చినందుకు గానూ స్థానిక రాజా హిందీ కళాశాల వ్యవస్థాపకులు డాక్టర్ మంచిపల్లి శ్రీరాములుకు రైతు నేస్తం అవార్డును భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గన్నవరం స్వర్ణ భారతి ట్రస్ట్‌లో అందజేశారు.