NTV Telugu Site icon

Venkaiah Naidu: ఏపీ రోడ్ల పరిస్ధితి దారుణం.. వాటిపై దృష్టి పెట్టండి..!

Venkaiah Naidu

Venkaiah Naidu

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై పలు సందర్భాల్లో విమర్శలు వస్తూనే ఉన్నాయి.. తాజాగా, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీలోని రోడ్ల దుస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం సమీపంలోని కిసాన్ క్రాఫ్ట్ ను సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా సొంత జిల్లా నెల్లూరులో కిసాన్ క్రాఫ్ట్ సంస్థను నెలకొల్పడంఎంతో సంతోషంగా ఉందన్నారు.. స్ధానికంగా ఉన్న గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించడం ఎంతో అభినందనీయం అన్నారు.. నెల్లూరు జిల్లా నుండి విదేశాలకు వ్యవసాయ పనిముట్లను ఎగుమతి చేయడం ఎంతో గర్వకారణం అన్న వెంకయ్యనాయుడు.. రోడ్ల పరిస్ధితి మాత్రం ఎంతో దారుణంగా ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపై దృష్టి పెట్టాలని సూచించారు.. ఇక, ఇప్పటి పరిస్ధితిలో వ్యవసాయం.. ఎద్దులు, నాగలితో దున్నే పరిస్ధితి లేదు. .యంత్రాల మీదే ఆధారపడి జీవిస్తున్నామని.. గ్రామాలు దేశానికి పట్టు కొమ్మలు… గ్రామాలు బాగుంటే దేశం బాగున్నట్టే అన్నారు వెంకయ్యనాయుడు.

Read Also: Kottu Satyanarayana: అమరావతి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది..

నెల్లూరు జిల్లా పొదలకూరులో ఉన్న కిసాన్ క్రాఫ్ట్ సెంటర్ ను సందర్శించడం ఆనందదాయకం అని పేర్కొన్నారు వెంకయ్య.. గ్రామీణ సాధికారతకు నిదర్శనంగా, మా సొంత గ్రామానికి దగ్గరలో ఇంత చక్కని పరిశ్రమను ఏర్పాటు చేయడం, స్థానిక గ్రామీణ యువతకు ఉపాధిని కల్పించడం ఆనందదాయకం. సంస్థ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.. కిసాన్ క్రాఫ్ట్ సెంటర్ లోని ప్రతి యంత్రం రైతుల అవసరాలకు తగినట్లుగా ఉంది. వ్యవసాయ రంగం అభివృద్ధికి, రైతుల ఆదాయాన్ని పెంచటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇలాంటి సంస్థల రూపంలో ప్రైవేటు రంగం చొరవ అత్యంత ఆవశ్యకం. కిసాన్ క్రాఫ్ట్ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగం ఆత్మ నిర్భరత సాధించాలంటే ఈ రంగంలో యాంత్రీకరణ, సాంకేతికతల వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఉంది. మానవ వనరుల ఉపాధికి ఇబ్బందులు లేకుండా కిసాన్ క్రాఫ్ట్ లాంటి సంస్థలు యంత్రాలతో పాటు, రైతులకి అవగాహనను పెంపొందించేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు వెంకయ్యనాయుడు.

ఇక, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులో సోమవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వెంకయ్య మాట్లాడుతూ సంపాదించిన దానిలో కొంత భాగం సమాజానికి ఇవ్వడం జీవితంలో భాగం కావాలని, సేవలేని జీవితం వ్యర్ధమని అన్నారు. అవినీతి, అక్రమాలపై పోరాటమే విజయదశమి అని, మన పెద్దవారు అందించిన సంస్కృతిని మనమంతా కాపాడుకోవాలన్నారు.. కులం కన్నా గుణం మిన్న. నీతి, నిజాయతీ కలిగిన ప్రజాప్రతినిధులను ప్రోత్సహించాలి. రాజకీయాల్లో కులం, నేరాలను ఎంత త్వరగా వదులుకుంటే ప్రజాస్వామ్యం అంత బలపడుతుంది. అవినీతి, అరాచకాలపై శాంతియుతంగా పోరాడాలి. అందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. నేను బాధ్యతల నుంచి తప్పుకున్నాను తప్ప అలసిపోలేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో జోక్యం చేసుకోను, కానీ రాజకీయాల గురించి మాట్లాడతాను. సిద్ధాంతాలను వదిలిపెట్టను. ఏ రాజకీయ పార్టీ తరఫునా ప్రచారం గానీ పోటీ గానీ చేయను అంటూ ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Show comments