ఆంధ్రప్రదేశ్ లో మహిళల చిన్నారులపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్ష టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వైసిపి ప్రభుత్వాన్ని టిడిపి శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో సామూహిక అత్యాచారానికి గురైన దళిత గర్భిణిని ఆదుకోవాలని వైసిపి ప్రభుత్వాన్ని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు. బాధితురాలికి తక్షణమే కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రామయ్య లేఖ రాసారు.
కట్టుకున్న భర్త, కన్నబిడ్డల ముందే మృగాళ్ల చేతిలో అత్యంత దారుణంగా అత్యాచారానికి గురైన మహిళ ప్రస్తుతం ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతోన్న రేపల్లు అత్యాచార బాధితురాలిని వర్ల రామయ్యతో పాటు టిడిపి నాయకులు పరామర్శించారు. బాధిత మహిళ యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రభుత్వ నిర్బంధాన్ని ఛేదించుకుని హాస్పిటల్ కు వెళ్లాల్సి వచ్చిందని వర్ల రామయ్య మండిపడ్డారు.
అతి దారుణంగా లైంగిక దాడికి గురయిన బాధిత మహిళ పురుషులను చూస్తేనే భయంతో వణికిపోతోందని ఆయన అన్నారు. ఆమె మానసిక స్థితి చూస్తే ఎంత చిత్రవధ అనుభవించిందో అర్థమవుతుందన్నారు. రైల్వేస్టేషన్ లో గ్యాంగ్ రేప్ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడాన్ని బట్టే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్ధమవుతుందన్నారు.
తల్లిదండ్రులు పెంపకం సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని హోంమంత్రి తానేటి వనిత మాట్లాడటం బాధ్యతారాహిత్యమని వర్ల మండిపడ్డారు. లేని దిశా చట్టం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం తప్ప మహిళల భద్రత కోసం నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నట్లుగా కనిపించడంలేదన్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతి చెందిన వారికి సీఏం కోటి రూపాయల పరిహారం ఇచ్చారు… కానీ, గ్యాంగ్ రేప్‌కు గురైన ఎస్సీ మాదిగ మహిళకు కేవలం 4.12 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అత్యంత అమానవీయం అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ పరిహారం ఏ రూపంలో, ఎక్కడ ఇచ్చారో క్లారిటీ లేదన్నారు. దీన్ని బట్టే ఎస్సీ మహిళలపై వైసీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏ..పాటిదో అర్ధమవుతోందన్నారు.
బాధిత మహిళ కుటుంబం వారి స్వస్థలానికి వెళ్లి పనులు చేసుకునే పరిస్థితులు లేవన్నారు రామయ్య. కాబట్టి ప్రభుత్వం ఆ బాధితురాలికి తక్షణమే కోటి రూపాయల ఆర్థిక సాయం, 5 ఎకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం, సొంత ఇల్లు ఇచ్చి సామాజికంగా, ఆర్థికంగా భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ లేఖ ద్వారా సీఎం వైఎస్ జగన్ ను కోరారు రామయ్య. అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఘోరాలు జరగకుండా వైసిపి ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు.
Taneti Vanita: పేదవాళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా చంద్రబాబూ?
