Site icon NTV Telugu

Vangalapudi Anitha: జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ.. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై విచారణ జరపాలి

Vangalapudi Anitha

Vangalapudi Anitha

Vangalapudi Anitha: జాతీయ మహిళా కమిషన్‌కు టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత గురువారం నాడు ఓ లేఖ రాశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడ్ సహా ఏపీలో పెద్ద ఎత్తున మహిళలపై వేధింపులు, దాడులు జరుగుతున్నాయని లేఖలో అనిత వివరించారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై జాతీయ మహిళా కమిషన్ విచారణ జరపాలని ఆమె కోరారు. మహిళలపై వేధింపులను అరికట్టడంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉందంటూ లేఖలో స్పష్టం చేశారు. బాధిత మహిళల వివరాలను లేఖకు జత చేసి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కు పంపారు.

జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు, దాడులు పెరిగాయని లేఖలో వంగలపూడి అనిత ఆరోపించారు. ఏపీలోని మహిళలు అభద్రత, ప్రాణ, మాన భయంతో బతుకుతున్నారని.. జూన్ 2019 నుంచి జూలై 2022 వరకు సుమారుగా 777 మంది మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరిగాయని లేఖలో వివరించారు. ఏపీ ప్రభుత్వం దిశా చట్టం పేరుతో మహిళలను మోసం చేస్తోందని ఆరోపించారు. దిశా చట్టం ఒక అపోహ మాత్రమేనని, అలాంటి చట్టం అసలు అమలులోనే లేదన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాల్లో వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నారని విమర్శలు చేశారు. వైసీపీ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మహిళా ప్రభుత్వ ఉద్యోగులను, ఇతర మహిళలను బెదిరిస్తున్నారని తెలిపారు.

Read Also: Annamayya District: లేడీ కిల్లర్.. కోడలి తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన అత్త

ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని.. తాము ఎన్నుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలాంటి వారా అని ప్రజలు బాధ పడుతున్నారని జాతీయ మహిళా కమిషన్‌కు రాసిన లేఖలో వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై ఎలాంటి విచారణ జరపకుండా పోలీసులు మాధవ్ కు క్లీన్ చిట్ ఇచ్చారన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్, మార్ఫింగ్ చేసిన వీడియో అని అనంత ఎస్పీ ఫకీరప్ప చెప్పడం విస్మయం కలిగిస్తోందని.. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా ఎంపీ మాధవ్ వీడియో క్లిప్‌పై జాతీయ మహిళా కమిషన్ విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి అధికార వైసీపీ నేతలను కాపాడేందుకు కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు.

Exit mobile version