మరోసారి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఏమైనా, ప్రజలు ఎక్కడకు పోయినా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆమె ఆరోపించారు. కోనసీమను చూస్తుంటే పాకిస్థాన్ గుర్తుకొస్తోందని, జగన్ అరాచకానికి కోనసీమ ప్రాంతం మచ్చుతునక అంటూ ఆమె మండిపడ్డారు. అధికారదాహాంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైళ్లు తగలబెట్టించారని, సొంతపార్టీ ఎమ్మెల్సీని కాపాడుకోవడానికి, మంత్రి ఇంటిని తగలబెట్టిన వారు, రేపు అధికారం కోసం ప్రజల్ని తగలబెట్టరా? అని ఆమె ప్రశ్నించారు.
65 మందిని పోలీసులు అరెస్ట్ చేస్తే 45మంది వైసీపీ వారే ఉన్నారని, ఆత్మకూరులో దమ్ముంటే పోటీ చేయండి అనేవారికి దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు రావాలని ఆమె సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించండని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల్లోకి వెళ్లి ఎవరి బలం ఎంతుందో తేల్చుకుందామని, అత్యాచారాలను తేలిగ్గా తీసుకునేవారు ఆడబిడ్డల మానప్రాణాలు కాపాడతారా..? అని ఆమె అగ్రహం వ్యక్తం చేశారు.