VandeBharat: విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీసేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 15న ఈ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రైలుకు సంబంధించిన బుకింగ్స్ ఈరోజు నుంచే ప్రారంభం అయ్యాయి. వందే భారత్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఇందులో రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్ కేటగిరీవి. మిగతావి ఎకానమీ కోచ్‌లు. ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో 104 సీట్లు ఉంటాయి. ఎకానమీ క్లాస్‌లో 1,024 సీట్లు ఉంటాయి. మొత్తంగా ఈ రైలులో ఒకేసారి 1,128 మంది ప్రయాణం చేయవచ్చు.
Read Also: Vaarasudu Review: వారసుడు మూవీ రివ్యూ (తమిళ డబ్బింగ్)
అయితే విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ రైలులో ప్రయాణించాలంటే ఎకానమీ క్లాస్ టిక్కెట్ ధర రూ.1,720, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ ధర రూ.3,170 గా చెల్లించాల్సి ఉంటుంది. అయితే అధికారికంగా టిక్కెట్ ధరలపై ప్రకటన రావాల్సి ఉంది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ కౌంటర్లలోనూ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 5 స్టేషన్లలో ఆగుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతూ విశాఖ చేరుకుంటుంది. అయితే తొలిరోజు ప్రారంభం సందర్భంగా ఈ రైలు 21 స్టేషన్లలో ఆగనుంది. చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ జంక్షన్, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతూ విశాఖపట్నం చేరుకోనుంది. విశాఖపట్నం నుంచి వచ్చిన రైలును సికింద్రాబాద్ స్టేషన్‌లోని 10వ నంబర్ ప్లాట్‌ఫారం వైపున ఉన్న కోచ్ మెయింటెనెన్స్ డిపో ట్రాక్‌పై నిలిపారు. విశాఖపట్నంలో ఇటీవల ఆకతాయిలు రైలుపై రాళ్ల దాడికి పాల్పడిన నేపథ్యంలో స్థానిక ఆర్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.