కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండల ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఎంపీపీ పీఠం కోసం జనసేన ఎంపీటీసీ విజయ్ కుమార్, జనసేన రెబల్‌గా గెలిచిన ధనబాబు నామినేషన్లు దాఖలు చేయడంతో రాజకీయం వేడెక్కింది. ఉప్పాడ 1 నుంచి గెలిచిన విజయ్ కుమార్ వైపు పార్టీ మొగ్గు చూపగా, పొన్నాడ 1 నుంచి ఎంపీటీసీగా గెలిచిన ధనబాబు సైతం పోటీకి దిగారు.
మండల బలాబలాలు.. 14 మంది మద్దతు ప్రకటన
ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మొత్తం 24 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో జనసేన 14 చోట్ల గెలవగా, వైసీపీ 5, టీడీపీ 4, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా 14 మంది ఎంపీటీసీలు విజయ్ కుమార్‌కు మద్దతు తెలిపినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ధనబాబు వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఎంపీ, ఎమ్మెల్యేను చుట్టుముట్టిన ఇరువర్గాలు
విజయ్ కుమార్‌కే ఎంపీపీ పదవి కేటాయించాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తుండగా, ధనబాబుకు ఇవ్వాలంటూ మరో వర్గం ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో ఎంపీ ఉదయ్, ఎమ్మెల్యే పంతం నానాజీ అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా ఇరువర్గాలు వారిని చుట్టుముట్టి తమకు న్యాయం చేయాలని కోరాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎంపీ, ఎమ్మెల్యేలను భద్రత నడుమ అక్కడి నుంచి తీసుకెళ్లారు.

