NTV Telugu Site icon

Polavaram Hydro Power Project: పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌పై కేంద్రం క్లారిటీ.. 2026 నాటికి పూర్తి..!

Polavaram Hydro Power Proje

Polavaram Hydro Power Proje

Polavaram Hydro Power Project: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై కూడా కేంద్రం క్లారిటీ వచ్చింది.. పోలవరం ప్రాజెక్టులో భాగంగా 5338 కోట్ల వ్యయంతో చేపట్టిన 960 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం 2026 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ఏపీ జెన్‌కో ఉందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.. ఇవాళ రాజ్యసభలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన షెకావత్.. ఏపీ జెన్‌కో (ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు.. ఏపీజెన్‌కో ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రాజెక్టు పవర్ హౌస్ పునాది నిర్మాణం కోసం తవ్వకాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని.. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిగా ఏపీ ప్రభుత్వ సొంత నిధులతోనే అమలు చేస్తారని.. కేంద్ర ప్రభుత్వం అందుకు నిధులేమీ కేటాయించడం లేదని వెల్లడించారు షెకావత్..

Read Also: Revanth Reddy: జీరో బడ్జెట్.. భూప్రపంచంలో ఇలాంటి బడ్జెట్‌ ఎవరూ ప్రవేశపెట్టలేదు..

మరోవైపు, పోలవరం ప్రాజెక్టును మార్చి 2024 కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ప్రకటించారు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు.. దీని కోసం జూన్ 2024 కల్లా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పూర్తి చేయాలన ఆదేశాలు జారీ చేశారు.. అయితే, గోదావరి నదికి ఇటీవల వచ్చిన వరదల కారణంగా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.. తెలుగు దేశం పార్టీ ఎంపీ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన బిశ్వేశ్వర్‌ తుడు.. ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఇక, రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చిన బిశ్వేశ్వర్‌ తుడు.. దేశంలో నదుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా గుర్తించిన మొత్తం 30 లింకులలో 8 లింకు ప్రాజెక్ట్‌లకు సంబంధించి సవివర ప్రాజెక్ట్‌ నివేదికలు పూర్తయ్యాయని తెలిపారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు.. లిఖితపూర్వక సమాధానమిస్తూ.. మరో 24 లింకు ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఫీజిబిలిటీ నివేదికలు కూడా పూర్తయినట్లు చెప్పారు. ప్రభుత్వ నేషనల్‌ పర్స్‌పెక్టివ్‌ ప్లాన్‌ కింద నదుల అనుసంధానం కోసం జాతీయ జలాభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) దేశవ్యాప్తంగా 30 లింకులను గుర్తించింది. ఈ లింకులన్నింటికీ ప్రీ ఫీజిబిలిటీ నివేదికలు పూర్తయ్యాయన్నారు.. నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌ అమలు కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం భరించాల్సి ఉంటుందని ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు.