NTV Telugu Site icon

Undavalli Arun Kumar: రెండు తెలుగు రాష్ట్రాల్లో తారక్‌ని బీజేపీ వాడుకుంటుంది

Undavalli On Shah Ntr Meet

Undavalli On Shah Ntr Meet

Undavalli Arun Kumar On Amit Shah Jr NTR Meeting: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జూ. ఎన్టీఆర్ కలయికపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వారి కలయిక వెనుక రాజకీయమే అయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తారక్‌ని వినియోగించుకునే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు. అయితే.. తారక్‌కి అన్ని విషయాలపై అవగాహన ఉందని, ఎప్పుడెలా వ్యవహరించాలో అతనికి తెలుసని అన్నారు. ఇదే సమయంలో శ్రీకాకుళంలో పర్యటనకు బయలుదేరిన నారా లోకేష్‌ను అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదని.. టీడీపీ ప్రభుత్వం ఇలాగే చేసి ఉంటే, జగన్ పాదయాత్ర చేయగలిగేవారా? అంటూ ప్రశ్నించారు. పోలీసులకు ప్రతిపక్ష నాయకుల్ని హౌస్ అరెస్ట్‌లు చేయడంతోనే సరిపోతోందని అన్నారు.

అలాగే.. మార్గదర్శి కేసు ప్రస్తావనని ఉండవల్లి తీసుకొచ్చారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిందని, సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మార్గదర్శి కేసులో ఎస్‌ఎల్‌పీ వేయాలని కోరారు. సెప్టెంబర్ 19న మార్గదర్శి కేసు వాయిదా ఉందని చెప్పిన ఉండవల్లి.. చట్టవిరుద్ధంగా రామోజీరావు 2,600 కోట్లు సేకరించారని ఆరోపించారు. తాను రామోజీరావుని జైల్లో పెట్టాలని చెప్పడం లేదని, కనీసం కేసు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రామోజీని కలిసేందుకు అమిత్ షా వచ్చారని.. రేపు అమెరికా అధ్యక్షుడు బైడెన్, ప్రధాని మోదీ కూడా రామోజీ వద్దకు రావొచ్చని ఎద్దేవా చేశారు.