కొన్ని వేల పాములను పట్టుకుని తిరిగి అడవుల్లో విడిచి.. వాటికి ప్రాణం పోశాడు.. అయితే అదే పాము కాటుకు గురై నేడు.. ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఆరు రోజుల క్రితం ఓ కళాశాలలో పామును పడుతుండగా పాముకాటుకు గురైన టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ వైపు పాము కాటు.. మరోవైపు డెంగ్యూ కూడా సోకడంతో భాస్కర్ నాయుడు ఆరోగ్యం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
అంతేకాకుండా ప్లేట్ లెట్స్ కూడా తగ్గిపోవడంతో వైద్యులు భాస్కర్ నాయుడికి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై భాస్కర్ నాయుడు చికిత్స పొందుతున్నారు. భాస్కర్ నాయుడు ఆరోగ్య పరిస్థతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తిరుమల, తిరుపతిలో విష సర్పాల నుండి భక్తులను భాస్కర్ నాయుడు రక్షిస్తున్నారు. టీటీడీ ఉద్యోగిగా పని చేస్తూ భాస్కర్ నాయుడు ఇప్పటి వరకు 10వేల పాములకు పైగా పట్టుకున్నారు. రిటైర్ అయినప్పటికీ భాస్కర్ నాయుడు టీటీడీ లో సేవలు కొనసాగిస్తున్నారు.