విద్యుత్ కష్టాలు, అదనపు భారం నుంచి టీటీడీ బయటపడే మార్గాలు వెతుకుతోంది. ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ప్రారంభించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 139 కేవీఏ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటయింది. టీటీడీ కళాశాలలో ఇప్పటి వరకు యూనిట్ విద్యుత్‌కు రూ. 11.50 చెల్లిస్తున్నామని, ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్‌తో యూనిట్ ఖర్చు రూ. 3.33కు తగ్గిందన్నారు. మొత్తంగా కళాశాలపై విద్యుత్తు బిల్లుల భారం నెలకు రూ. లక్షకు పైగా తగ్గింది.
కళాశాల భవనాల పైకప్పును సోలార్ పవర్ ఉత్పత్తి చేసే సంస్థకు ఇచ్చాం. విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ నిర్వహణ మొత్తం ఆ సంస్థ చూసుకుంటుంది. సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. 190 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను ఈ ప్లాంట్ నిరోధిస్తుంది. కొన్ని వేల మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనం ఈ ప్లాంటుతో కల్గుతుంది. వెంకటేశ్వర కాలేజి అడ్మిషన్లలో తెలుగువారికి కోటా లేకుండా పోయింది. ఢిల్లీ యూనివర్సిటీ నిబంధనలు మార్చడంతో సీట్లన్నీ యూనివర్సిటీ ద్వారా భర్తీ అవుతున్నాయి.
గతంలో ఉన్న మాదిరిగా కళాశాల యాజమాన్యానికి సీట్లను రిజర్వ్ చేయమని కోరాం. తద్వారా ఢిల్లీలో ఉంటున్న తెలుగువారికి అడ్మిషన్ కల్పించడం సాధ్యపడుతుంది. అయితే, టీటీడీ కాలేజికి అవకాశమిస్తే, మిగతా కాలేజీలు కూడా యాజమాన్య కోటా కావాలని పట్టుబడతాయంటూ ఢిల్లీ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పడిపోకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. ఏదేమైనా తెలుగు విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు మేం కృషి చేస్తాం.
శ్రీ వెంకటేశ్వర కళాశాల ర్యాంకింగ్ గతం కంటే చాలా మెరుగుపడింది. పరిశోధనల్లోనూ కాలేజి చాలా చురుకుగా వ్యవహరిస్తోంది. సోలార్ ప్లాంట్ కారణంగా ఆదా అయ్యే విద్యుత్తు బిల్లు సొమ్మును ప్రత్యేకంగా దాచిపెట్టమని చెప్పాను. ఆ నిధులతో కాలేజి హాస్టల్ భవంతులపై సొంతంగా పవర్ ప్లాంట్ పెట్టాలని యోచిస్తున్నామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి.