అంజనాద్రే హనుంతుడి జన్మస్థలం అని టిటిడి నియమించిన కమిటీ నివేదిక సమర్పించిందన్నారు ఇఓ జవహర్ రెడ్డి. శ్రీరామ నవమి పర్వదినం రోజున వెల్లడిస్తే బాగుంటుంది అని కొంత మంది సలహాలు ఇవ్వడంతో వారం రోజుల పాటు ఆధారాల సమర్పణ భక్తులు ముందు వుంచే ప్రయత్నాన్ని వాయిదా వేస్తున్నామన్నారు ఇఓ. కమిటీ సమర్పించిన ఆధారాలను భక్తులు ముందు ఉంచుతామని… భక్తులు సూచన మేరకు కమిటీని ఏర్పాటు చేసి ఆధారాలు సమర్పించమని ఆదేశించామని ఆయన అన్నారు. హంపిలోని కిష్కింద కూడా హనుమంతుని జన్మస్థలం అని ఆ ప్రాంతం వారు అంటున్నారని…. చర్చల మీద అసలు విషయం వెలుగులోకి వస్తూందని భావిస్తున్నామన్నారు ఇఓ జవహర్ రెడ్డి.
ఘనంగా ఉగాది :
ఇక మరో పక్క శ్రీ వారి ఆలయంలో ఫ్లవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో ఉదయం సుప్రభాతం అనంతరం శుద్ధి నిర్వహించారు. తరువాత శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామివారికి…. శ్రీవారి సర్వ సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు అర్చకులు. అనంతరం నూతన పట్టు వస్త్రాలు విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం ఘంటా మండపంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు వేదపండితులు. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. శ్రీవారి ఆలయాన్ని ఉగాది పర్వదినం సందర్భంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. 8 టన్నుల పుష్పాలు,70 వేల కట్ ఫ్లవర్ ల్స్తో పాటు వివిధ రకాల ఫలాలతో మహద్వారం నుంచి ఆనంద నిలయం వరకు ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం వెలుపల కూడా వివిధ రకాల పుష్పాలతో ఏర్పాటు చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.