NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్!

Top Headlines@9am

Top Headlines@9am

నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా సొమశీల జలాశయాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత జలాశయ మరమ్మతు పనులపై సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రాం నారాయణరెడ్డి, నారాయణ పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం సత్యవేడు శ్రీసిటిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీసిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. 15 సంస్థల కార్యకలాపాలను శ్రీసిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే, మరో 7 సంస్థల ఏర్పాటుకు ఆంధ్ర ప్రధేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 900 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2,740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభఇంచనున్నాయి. మరో 1,213 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి నాలుగు ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అనంతరం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సీఈఓలతో నిర్వహించే సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

నేటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ ఇంటి దగ్గర ప్రజావాణి కార్యక్రమం
నేటి నుంచి కాకినాడలోని చేబ్రోలులో ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర జనవాణి కార్యక్రమం జరగనుంది. ఇవాళ్టి (సోమవారం) నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. సమస్యలు ఉన్న వారు నేరుగా హెల్ప్ డెస్క్ లో ఫిర్యాదులు ఇచ్చేలా సిబ్బందిని డిప్యూటీ సీఎం ఏర్పాటు చేశారు. అలాగే, ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల ఆమోదం కోసం ఈ నెల 23వ తేదీన చేపట్టనున్న గ్రామ సభలకు సంబంధించి పవన్‌ కళ్యాణ్ అధికారులతో నేడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది ఏయే రకాల పనులు చేపట్టాలనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు (ఈ నెల 23న) ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చారు. గ్రామ సభలకు సంబంధించి దిశా నిర్దేశం చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, జిల్లా కలెక్టర్‌ ఆఫీసులో జడ్పీ సీఈవోలు, డీపీవోలు, డ్వామా పీడీ, డీఎల్‌డీవోలు, డీఎల్‌పీవోలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ఎంపీడీవోలు, ఈఓ పీఆర్‌ అండ్‌ ఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి పథకం ఏపీవోలు హాజరు కావాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

నేడు రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి నామినేషన్..
ఎమ్మెల్యేల కోటా రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వి నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఆయన ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆదివారం సాయంత్రం నానక్‌రామ్‌గూడలోని షెరటన్‌ హోటల్‌లో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎల్‌పీఏ) సమావేశంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు రేవంత్‌ సింఘ్వీని పరిచయం చేశారు. సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ఆమోదించారు. కాగా.. రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె.కేశరావు రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని ఇటీవల హైకమాండ్ ధృవీకరించింది. దీంతో ఈ స్థానంలో అభిషేక్ ను గెలిపించడమే సీఎల్ ఎఫ్ సమావేశంలో ప్రధాన ఎజెండా. దీంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, సంక్షేమ పథకాలపై చర్చిస్తారని తెలిసింది. అలాగే, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి భేటీ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వచ్చిన సింఘ్వి.. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రానికి వీడని వర్షాలు.. మరో మూడు రోజుల పాటు వానలే..
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వీడటం లేదు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు ఈరోజు తెల్లవారుజాము నుంచి పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, జంగం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అలాగే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ భారీ వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం సాయంత్రం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కోఠి, నాంపల్లి, సోమాజిగూడ, ఉప్పల్, తార్నాక, హయత్ నగర్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై నీరు నిలవడంతో చాదర్‌ఘాట్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

నేడు రక్షాబంధన్.. రాఖీ కట్టడానికి సరైన సమయం ఇదే!
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ ‘రక్షాబంధన్‌’. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి నాడు రక్షాబంధన్‌ పండగను జరుపుకొంటారు. ఈ ఏడాది సోమవారం (ఆగస్టు 19) రక్షాబంధన్ పండుగ వచ్చింది. ఈ రోజున సోదరీమణులు తన సోదరుల చేతి మణికట్టుకు రాఖీలను కడతారు. సోదరులు కూడా సోదరీమణులకు నిత్యం రక్షణగా ఉంటానని హామీ ఇస్తూ.. బహుమతి కూడా ఇస్తారు. నేడు రాఖీ కట్టడానికి సరైన సమయం ఏంటో ఓసారి చూద్దాం. శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 19 తెల్లవారుజామున 3:04 గంటలకు ప్రారంభమవుతుంది. శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 19 రాత్రి 11:55 గంటలకు ముగుస్తుంది. సోమవారం ఉదయం 5.53 గంటల నుంచి మధ్యాహ్నం 1.32 గంటల వరకు భద్రకాలం ఉంటుంది. ఉదయం 7.31 నుంచి 9.08 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. భద్రకాలం, రాహుకాలంలో రాఖీ కట్టకూడదు. శాస్త్రాల ప్రకారం… భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్రకాలంలో రాఖీ కడితే అశుభం జరుగుతుందని చెబుతారు. భద్రకాలం ముగిసిన తరువాత సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కడితే మంచిదని పండితులు అంటున్నారు. సోమవారం భద్రకాల సమయం తెల్లవారుజామున 5.33 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 1.33 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 1.34 నుంచి రాత్రి 9.08 గంటల వరకు శుభసమయం ఉంది. ఈ శుభసమయంలో సోదరీమణులు సోదరులకు రాఖీ కడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని, సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదల.. వెస్టిండీస్‌తో భారత్‌ తొలి మ్యాచ్!
మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ 2025 జనవరి 18న మలేసియాలో ఆరంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2న జరగనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. 2023లో జరిగిన మొదటి అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్‌ కప్‌ గెలుచుకుంది. మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ 2025లో 16 జట్లు పాల్గొనున్నాయి. నాలుగు జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి.. షెడ్యూల్ రిలీజ్ చేశారు. నాలుగు వేదికలలో 16 రోజుల పాటు 41 మ్యాచ్‌లు జరగనున్నాయి. జనవరి 13 నుంచి 16 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్‌-ఏలో విండీస్, మలేసియా, శ్రీలంకతో కలిసి భారత్‌ ఆడనుంది. ఆతిథ్య జట్టు హోదాలో మలేషియా అండర్‌-19 ప్రపంచకప్‌లో అరంగేట్రం చేస్తోంది. ప్రతి గ్రూప్‌ నుంచి 3 జట్లు సూపర్‌-6కు అర్హత సాధిస్తాయి. సూపర్‌-6లో ఆరేసి జట్లు గ్రూప్‌-1, గ్రూప్‌-2గా విడిపోయి ఆడతాయి. జనవరి 25 నుంచి 29 సూపర్‌-6 మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్‌ సిక్స్‌లో ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌లో నిలిచిన రెండు జట్లు సెమీస్‌ చేరతాయి. జనవరి 31న సెమీస్‌ మ్యాచ్‌లు జరగనుండగా.. ఫిబ్రవరి 2న ఫైనల్‌ మ్యాచ్ జరుగుతుంది. సెమీస్‌ మ్యాచ్‌లకు, ఫైనల్‌కు రిజర్వ్ డే కూడా షెడ్యూల్ చేశారు. ఫిబ్రవరి 1 సెమీస్‌ మ్యాచ్‌లకు, ఫిబ్రవరి 3న ఫైనల్‌కు రిజర్వ్ డేగా ఉంది.

తన పని ముగించేసిన విశ్వక్ సేన్.. ఇక అంత దర్శకుడిదే..?
విష్వక్ సేన్ కెరీర్ జెట్ స్పీడ్ లో వెళుతోంది. వరుస సినిమాలతో విశ్వక్ బిజీగా ఉన్నాడు. తాజగా ఈ  యంగ్  హీరో   నటించిన మూవీ ‘మెకానిక్ రాకీ’. విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధాదాస్ కథానాయకలుగా నటిస్తున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూన్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన మెకానిక్ రాకి ట్రైలర్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచింది. కాగా ‘మెకానిక్ రాకీ’ విశ్వక్ సేన్ యొక్క 10వ చిత్రం, ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రిలీజ్ కు మరికొద్ధి రోజులు మాత్రమే ఉన్న ఈ సినిమా అటు చివరి దశ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో స్పీడ్ పెంచారు. తాజాగా మెకానిక్ రాకి డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసాడు దర్శక నిర్మాతలు. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ మొదలుపెట్టాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కొద్దీ రోజుల క్రితం ఈ చిత్రం నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యొక్క ఇండియా థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సురేష్ సంస్థ కొనుగోలు చేసింది. మెకానిక్ రాకి సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించగా, ప్రముఖ కమెడియన్, నటుడు సత్యం రాజేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగ వ్యవహారిస్తుండగా జేక్స్ బిజోయ్ స్వరాలూ సమకూస్తున్నారు.