Site icon NTV Telugu

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరాం: టీడీపీ ఎంపీలు

పార్లమెంట్‌లో జరిగిన అఖిలపక్ష భేటీలో టీడీపీ తరపున కనకమేడల రవీంద్రకుమార్‌, గల్లా జయదేవ్‌ పాల్గొన్నారు. సమావేశ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పలు అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు సూచించారు. ముఖ్యంగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారు కోరినట్టు తెలిపారు. ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రాష్ర్ట ప్రభుత్వం తగ్గించలేదని చెప్పామన్నారు. దీనిపై ఏకీకృత నిబంధనలు తీసుకొచ్చి దేశమంతా ఒకే ధర ఉండేలా చూడాలని కోరినట్టు వెల్లడించారు.

విశాఖ ఉక్కు, ఇతర సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని కోరామన్నారు. ఇప్పటికే రాష్ర్టానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలో హామీలను కూడా నేరవేర్చాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు ఎంపీలు తెలిపారు. రాష్ర్టంలో వచ్చిన తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలకు సాయాన్ని అందించాలని కోరామని ఎంపీలు వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం రాష్ర్టానికి రావాల్సిన ఇతర సంస్థలు, కాలేజీలను వెంటనే ఏర్పాటుచేయాలని కోరినట్టు వెల్లడించారు.

Exit mobile version