Religious Conversion Pressure: తిరుపతిలో పెళ్లి పేరుతో యువతిని మోసం చేసి.. మతం మారాలని ఒత్తిడి చేసిన కేసులో నిందితుడిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన రయీద్‌ను మలక్‌పేట్ అక్బర్‌బాగ్‌లోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. జార్జియాలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న సమయంలో బాధితురాలికి రయీద్‌తో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం కొనసాగించినట్లు కేసు వివరాల్లో ఉంది. ఆ తర్వాత తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌కు పిలిపించి మరోసారి కలిసినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి గురించి బాధితురాలు ప్రశ్నించడంతో తన మతంలోకి మారాలని రయీద్ ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మతం మారేందుకు అంగీకరించకపోతే వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని.. బంధువులకు పంపుతానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
ఇక, బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు.. ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్‌లో కేసుకు సంబంధించిన కీలక సాంకేతిక ఆధారాలను పోలీసులు గుర్తించినట్లు వెల్లడించారు. పెళ్లి పేరుతో మోసం, బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులు సోషల్ మీడియా పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

