AP Panchayat Elections: నగదు ఇచ్చుకో.. సర్పంచి పదవి పుచ్చుకో! రేణిగుంటలో రూ.1.5 కోట్ల డిమాండ్?

Unanimous Panchayat Incenti

Unanimous Panchayat Incenti

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంటలో సర్పంచి పదవుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆరు ప్రధాన పంచాయతీల్లో సర్పంచి పదవులకు భారీగా డిమాండ్ ఏర్పడిందని, పదవుల కోసం వేలం జరుగుతోందంటూ ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా రేణిగుంట సర్పంచి పదవికి ఏకంగా రూ.1.5 కోట్లు ధర పలికినట్లు ప్రచారం జరుగుతోంది.

మిగిలిన పంచాయతీల్లోనూ సర్పంచి పదవులకు రూ.75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ ఉన్నట్లు సమాచారం. కూటమి మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. కొందరు అభ్యర్థులు పంచాయతీ అభివృద్ధి పనుల్లో వాటాలు ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన వారికి కాకుండా, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కొందరు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికంగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా, రేణిగుంట పరిధిలోని పలు పంచాయతీలకు సంబంధించిన ఏకగ్రీవాల జాబితాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్పంచి పదవుల కోసం భారీ మొత్తాల్లో నగదు చేతులు మారుతోందన్న ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే పదవుల వేలం, నగదు ఆఫర్లకు సంబంధించిన ప్రచారంపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.