Heavy Devotee In Tirumala: కలియుగ దైవం ఆ శ్రీనివాసుడు కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుస సెలవులు రావడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తిరుమలగిరుకు భక్తులు పొట్టెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఇక, టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతుంది. అలాగే, నిన్న శ్రీవారిని 72, 487 మంది భక్తులు దర్శించుకోగా.. 29, 500 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 4.52 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది.
Read Also: US: అమెరికాలో ఎయిర్‌లైన్స్ సంక్షోభం.. 1,100 ఫ్లైట్స్ రద్దు.. 4 వేల విమానాలు ఆలస్యం
మరోవైపు, 30వ తేదీ నుంచి జనవరి 8వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది. 30వ తేదీన స్వర్ణ రథంపై భక్తులకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. 31న శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం జరగనుంది. 10 రోజులు పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ సందర్భంగా పది రోజుల పాటు సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కాగా, వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. మొదటి మూడు రోజులకు ఆన్ లైన్ విధానంలో ఇప్పటికే టికెట్ల జారీ పూర్తైంది. మిగిలిన ఏడు రోజులకు టోకెన్ లేకుండా సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్యూ లైనులకు అదనంగా క్యూ లైనులు ఏర్పాటు చేస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్డుని క్యూ లైనుగా టీటీడీ మార్చింది. 2400 మంది పోలీసులు,1150 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసింది.
