తిరుపతి విష్ణు నివాసం దగ్గర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల కోసం భారీగా భక్తులు పోటెత్తారు. దీంతో తీవ్ర తొక్కిసలాట జరగడంతో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. హుటాహుటినా ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు నిలబడలేదు. పలువురు భక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా వైకుంఠ దర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే టోకెన్ల కోసం బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లలోకి భక్తులను ఒక్కసారిగా వదలడంతో తోపులాట జరిగింది. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. తోపులాట జరిగిన ప్రాంతాలకు విజిలెన్స్, పోలీసు బలగాలు భారీగా చేరుకున్నారు.
సమాచారం అందుకున్న టీడీడీ ఈవో శ్యామల రావు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. పోలీసులతో కలిసి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు.