TTD Ghee Adulteration Case : కలియుగ ప్రత్యక్షదైవం.. తిరుమల తిరుపి శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపాయి.. అయితే, ఈ కేసులో సంచలన విషయాలు సీబీఐ దర్యాప్తులో బయటకు వచ్చాయి.. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ నిర్వహించిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ స్పష్టంగా నిర్ధారించింది.
Read Also: AP High Court: ఏఐ టెక్నాలజీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
లడ్డూ నెయ్యి నాణ్యతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీబీఐ మరింత లోతైన విచారణ చేపట్టింది. ఈ క్రమంలో గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (NDDB) ద్వారా నెయ్యి నమూనాలను మరోసారి పరీక్షించించింది. ఈ పరీక్షల్లో నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని NDDB రిపోర్ట్ ఇచ్చింది. సీబీఐ 2025 జనవరి 8న NDDBకి లేఖ రాసి, గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించాలని కోరింది. అందుకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించిన NDDB, 2025 మార్చి 27న తన నివేదికను సీబీఐకి అందజేసింది. ఆ నివేదికలో నెయ్యి పూర్తిగా స్వచ్ఛమైనదేనని, జంతు కొవ్వు కలిసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ నివేదికతో తిరుమల లడ్డూ నెయ్యిపై వచ్చిన కల్తీ ఆరోపణలకు సీబీఐ స్పష్టమైన ముగింపు పలికింది. భక్తుల్లో నెలకొన్న సందేహాలకు కూడా ఈ దర్యాప్తు నివేదికతో స్పష్టత వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
