NTV Telugu Site icon

Tirumala Brahmotsavam 2024: నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Tirumala

Tirumala

Tirumala Brahmotsavam 2024: కలియుగ వైకుంఠమైన తిరుమల బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరుగుతుంది. విశేష పర్వదినాలుగా పిలిచే ఈ నెలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నిన్న మహాలయ అమావాస్యకాగా.. ఇవాళ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు. రేపు ధ్వజారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈనెల 8న జరిగే శ్రీవారి గరుడసేవకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 9న శ్రీవారి స్వర్ణరథోత్సవం, 11న ర‌థోత్సవం, 12న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావ‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 13న శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం, 28న సర్వ ఏకాదశి, 31న శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం నిర్వహణ ఉంటుంది.

Read Also: Varahi Public Meeting: నేడు తిరుపతిలో వారాహి సభ.. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై ఆసక్తి..

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుండి నిన్న డిఎఫ్‌వో శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. తర్వాత శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. రేపు జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. అటు.. బ్రహ్మోత్సవాలుకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. నిన్న తిరుమలకు వచ్చిన డీజీపీ మీడియాతో మాట్లాడారు. తిరుమలలో దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అందుబాగులో 2 వేలకు పైగా సీసీ కెమెరాలను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తామన్నారు.