ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామ వైసీపీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కారణంగా జి.కొత్తపల్లిలో పోలీసుల రెండు వారాల పాటు 144 సెక్షన్ విధించారు. గ్రామంలో 8 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 150 మంది పోలీసులు మోహరించారు. ఈ కేసుకు సంబంధించి 10 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బజారయ్య ద్వారకాతిరుమల పోలీసుల ముందు ఆదివారం మధ్యాహ్నం లొంగిపోయాడు. తనకు హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదని, తాను ఏ భూవివాదంలో జోక్యం చేసుకోలేదని చెప్పాడు. రాజకీయంగా తనను అణగదొక్కే కుట్ర జరిగిందని తెలిపాడు. చట్టప్రకారం ముందుకెళ్తానని పేర్కొన్నాడు. అటు లొంగిపోయిన బజారయ్యను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
కాగా వైసీపీ నేత గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను హోం మంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి ఆళ్ల నాని, ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పార్టీ కోసం గంజి ప్రసాద్ ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. గంజి ప్రసాద్ కుటుంబానికి వైసీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గంజి ప్రసాద్ హత్యకు పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారని చెప్పారు. బజారయ్య అనే వ్యక్తిపై విచారణ జరుగుతోందని తెలిపారు. బాధిత కుటుంబానికి కచ్చితంగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ హత్యకు కారకులు, ప్రేరేపించిన వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
https://www.youtube.com/watch?v=aWSxr234GOA
Kakinada: పుట్టినరోజు నాడు సినిమా చూసేందుకు వచ్చిన వ్యక్తి దారుణహత్య
