మరో రెండు గంటల్లో ఆ జంటకు పెళ్లి.. పెళ్లి పనుల్లో కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారు. కొత్త జీవితాన్ని ఉహించుకొని వధువు ఎన్నో కలలు కట్టుంది. అంతలోనే వరుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంకేముంది ఆ షాక్ నుంచి తేరుకోనేలోపు ఇరు కుటుంబాలకు చెప్పకుండా వరుడు జంప్ అయిపోయాడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వరుడు పెళ్లి మండపం నుంచి పారిపోయిన ఘటన అనంతపురంలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన ఒక యువతితో అనంతపురం జిల్లాకు చెందిన యువకుడికి వివాహం నిశ్చయమైంది. ముందు నుంచి వివాహం అంటే ఇష్టంలేని వరుడు పెద్దల బలవంతం వలన పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఇక బుధవారం వీరి పెళ్లి జరిపించడానికి పెద్దలు నిశ్చయించారు. అనుకున్నట్లుగానే పెళ్లి ఏర్పాట్లు అన్ని చేసి పెళ్లి మండపానికి వధూవరులను తీసుకొచ్చారు. ఇంకో రెండు గంటల్లో పెళ్లి అనగా వరుడు ఒక చెప్పు కనిపించడం లేదు.. వేరే చెప్పులు వేసుకొస్తానని వధువుకు చెప్పి బయటికి వెళ్ళాడు.
వెళ్లినవాడు ఎంతసేపటికి తిరిగిరాలేదు. దీంతో వరుడు కుటుంబ సభ్యులకు వరుడు పారిపోయాడన్న సంగతి తెలిసిపోయింది. దీంతో ఊరు మొత్తం గాలించి ఎట్టకేలకు వరుడిని వెతికి పంచాయితీ పెట్టించగా.. తనకు పెళ్లి ఇష్టం లేదని. కుటుంబ సభ్యుల బలవంతం వలన ఇక్కడి వరకు వచ్చానని వరుడు చెప్పఁడంతో.. ఇష్టంలేని పెళ్లి చేసుకొని ఎవరు బాధపడకూడదని ఆ పెళ్లిని రద్దు చేశారు. అయితే పీటల మీద పెళ్లి ఆగిపోతే తన కూతుర్ని ఎవరు వివాహం చేసుకుంటారని వధువు తల్లిదండ్రులు విలపిస్తున్నారు.