తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పెట్రోల్, డీజీల్ సరఫరా చేయలేమని ఏపీ పెట్రోలియం ట్యాంక్ ఆపరేటర్స్ అసోషియన్ అధ్యక్షడు వై.వి ఈశ్వర రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు 125 ట్రక్కుల ద్వారా 160 బంకులకు పెట్రోల్, డీజీల్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ టెండర్లు వేసిందన్నారు. ఈ టెండర్లలో పశ్చిమ, తూర్పు గోదావరి నుంచి ఒక్కరంటే ఒక్కరూ పాల్గొనలేదని ఆయన వెల్లడించారు. ఈనెల 17వ తేదిలోపు సమస్యలను పరిష్కరించకపోతే పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు పెట్రోల్ సరఫరా ను నిలిపి వేస్తామని ఆయన తెలిపారు.
ఇప్పటికే ట్రక్కులు పరిమితంగా తీసుకోవాలని కోరామన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా కేవలం ఇద్దరితోనే టెండర్ల ప్రక్రియను ముగించారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓవైపు ధరల పెరుగుదల మరోవైపు కోవిడ్ భారంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఈ భారాన్ని మేము భరించలేమని ఈశ్వర రావు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాని ఆయన కోరారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
