Site icon NTV Telugu

Terror Activity : ఏపీలో ఉగ్రకదలికలు.. భయం భయం..

Terror Activity

Terror Activity

Terror Activity : మొన్న విజయనగరం, నిన్న రాయచోటి.. నేడు ధర్మవరం.. ఉగ్రవాదుల కదలికలు ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతున్నాయి. సాధారణ జనంలో కలిసి పోయి ఉండి.. నిత్యం దాయాది దేశం పాకిస్తాన్‌లోని ముష్కర సంస్థలతో కొంత మంది సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి వ్యక్తిని ధర్మవరంలో కౌంటర్ ఇంటెలిజెన్స్, ఐబీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ముష్కర మూకలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నాడు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. మే 18 2025 విజయనగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. NIA, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సిరాజ్, సమీర్ కలిసి విజయనగరం, హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడులో భారీ కుట్రకు పాల్పడినట్లు NIA విచారణలో తేలింది.

సరిగ్గా నెలన్నర క్రితం రాయచోటిలోనూ ఉగ్రవాదుల కదలికలు బయటపడ్డాయి. అబూబాకర్, మహ్మద్ అలీ అలియాస్ యూసఫ్ అనే ఇద్దరు వ్యక్తులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై బీజేపీ అగ్రనేత LK అద్వానీ రథయాత్రపై కుట్ర పన్ని కేసుతోపాటు పలు ఇతర కేసులు ఉన్నాయి. వారిద్దరినీ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాయచోటి జనం ఉలిక్కిపడ్డారు. 30 ఏళ్లుగా అక్కడే ఉంటున్నా వారిని ఎవరూ గుర్తుపట్టలేదు. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు సంచలనం రేపుతున్నాయి..

Read Also : Illegal Affair : అడ్డొస్తే రక్తపాతమే.. అక్రమ సంబంధాల నెత్తుటి కథలు..

ధర్మవరంలో తెల్లవారక ముందే.. ఓ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బూట్ల చప్పుళ్లు, వాహనాల రాకతో స్థానికులు మేల్కొన్నారు. అప్పుడు అక్కడున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం చూసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలేం జరిగిందో చాలా సేపటి వరకు అంతుచిక్కలేదు. ఒక సాధారణ దొంగ అయితే ఇంత మంది పోలీసులు రారని.. ఏదో పెద్ద సంఘటన జరిగిందని ఊహించారు. అయితే వారు కూడా ఊహించనిదే జరిగింది.

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టిన నిఘా సంస్థలకు ధర్మవరంలోని కోట కాలనీలో నివాసం ఉంటున్న నూర్‌ మహ్మద్ షేక్‌పై అనుమానం వచ్చింది. ఓ హోటల్‌లో వంటమనిషిగా పని చేస్తున్న నూర్ కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో అతడ్ని ముందుగా లోకల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో జరిపిన సోదాల్లో 16 సిమ్ కార్డులు బయటపడ్డాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నూర్ సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచారు. ఉగ్రవాదులతో నూర్‌కు ఉన్న సంబంధాలపై మరింత లోతుగా ఆరా తీశారు..

నూర్ మహ్మద్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్ , ఐబీ అధికారులు రంగంలోకి దిగారు. నూర్ మహమ్మద్ షేక్ .. జైష్- ఏ- మహ్మద్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. జైష్- ఏ- మహ్మద్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మెంబర్‌లా ఉన్నాడని, అందులోని నెంబర్లకు ఇతని నుంచి వాట్సాప్ కాల్స్ వెళ్లాయని.. ముస్లిం యువతను ఉగ్ర సంస్థ వైపు మళ్లించేలా అందులో వ్యాఖ్యలు సైతం చేశాడని నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో.. అతని వ్యక్తిగత వివరాల గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. మౌలానా మసూద్ అజహర్ స్థాపించిన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థే జైషే మహ్మద్. భారత్ పై ఉగ్రదాడులు చేయడం లక్ష్యంగా పనిచేస్తోంది. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్ కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి భారీ ఉగ్రదాడులకు పాల్పడింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. అంతటి కీలక సంస్థతో సంబంధాలు ధర్మవరం ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఎలా వచ్చాయన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది?

నిజానికి రాయచోటిలో పట్టుబడ్డ ఉగ్రవాదులు.. స్థానికులు కాదు. పాకిస్తాన్ నుంచి వచ్చి మారు పేర్లతో రాయచోటిలో మకాం వేశారు. ఏళ్లతరబడి అందరితో కలిసి జీవినం సాగిస్తున్నా.. ఎవరికీ అనుమానం రాలేదు. ఇక్కడ నూర్ మహ్మద్ మాత్రం బయటి వ్యక్తి కాదు. ధర్మవరం ప్రాంతానికి చెందిన వాడే. ఇతను గతంలో బిర్యాయనీ సెంటర్ నడిపినట్టు తెలుస్తోంది. అందులో నష్టాలు రావడంతో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఇతనిపై ఇప్పటి వరకు ఎవరికీ అనుమానాలు రాలేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు బయట పడడం కలకలం రేపుతోంది. స్థానిక ముస్లిం యువతను ఇందులోకి లాగాడా అన్నది తేలాల్సి ఉంది..

Read Also : Udaya Bhanu : ఎక్కడ తిట్టాలో వాళ్లే చెప్తారు.. టీవీ షోలపై ఉదయభాను సెటైర్లు..

Exit mobile version