Minister KTR: ఎవరినీ బాధపెట్టాలని అలా మాట్లాడలేదు

ఏపీలో పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు కాకరేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. జగన్ సోదర సమానుడు.. ఏపీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా అన్నారు కేటీఆర్. ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. పక్క రాష్ట్రం లో కరెంటు ఉండడం లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో గత రాత్రి ట్విట్టర్ ద్వారా కేటీఆర్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తన వ్యాఖ్యల వెనక ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ఏపీలోని తన స్నేహితులను తెలియకుండానే తన వ్యాఖ్యలతో కొంత బాధ పెట్టి ఉండొచ్చన్నారు.

అయితే, ఎవరినో కించపరచాలనో, బాధపెట్టాలనో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, అన్యాపదేశంగానే అవి తన నోటి వెంట వచ్చాయని అన్నారు. ఏపీ సీఎం జగన్‌ను తన సోదరుడిగా భావిస్తానని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్టు కేటీఆర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై జగన్ మంత్రివర్గంలోని మంత్రులు కూడా తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఏపీకి వచ్చి అభినందిస్తున్నారు.. కానీ, కేటీఆర్ ఎవరి మహర్బానీ కోసమే ఈ వ్యాఖ్యలు చేశారని కౌంటర్‌ ఇచ్చారు.. కేటీఆర్ ఆ రకంగా మాట్లాడకూడదన్న ఆయన.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్నారు…ఇచ్చారా? నాలుగు చినుకులు పడగానే హైదరాబాద్ అంతా మునిగిపోతుంది.. డ్రగ్స్ కేసులు ఏ రకంగా హైదరాబాద్‌లో ఉన్నాయో అందరికీ తెలుసు.. ఇలాంటివి చెబితే చాలా ఉంటాయన్నారు కారుమూరి నాగేశ్వరరావు. మరో మంత్రి రోజా కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఏపీ గురించి కేటీఆర్‌ మాట్లాడలేదు అనుకుంటున్నా.. పొరుగు రాష్ట్రం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ కాదు అనుకుంటానన్నారు.

Minister Karumuri: కేటీఆర్‌ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి స్ట్రాంగ్‌ కౌంటర్‌