NTV Telugu Site icon

ఆడపిల్లల మానంకు 5 లక్షలు, ప్రాణంకు 10 లక్షలా : వంగలపూడి అనిత

నక్కపల్లి మండలంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారంయత్నం కేసు విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రంగా విరుచుకు పడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆమె ఆరోపించారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఉంటే ఎంత ? లేకపోతే ఎంత? అని ఆమె మండిపడ్డారు. ఆడపిల్లల తల్లితండ్రుల ఆవేదన ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్మోహన్ రెడ్డి కి తెలియదా అని ఆమె వ్యాఖ్యానించారు. రోజురోజుకీ ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే తాడేపల్లిలో నోరు మెదపకుండా జగన్ ఇంట్లోనే ఉంటున్నారని విమర్శించారు.

మన రాష్ట్రానికి హోమ్ శాఖ మంత్రి సుచరిత ఆడపిల్లల అత్యాచారాల పై నోరు మెదపకుండా ఉండటం దురదృష్టకరమని ఆమె అన్నారు. ఒకవేళ బయటకు వస్తే ఈ ప్రభుత్వం తరపున ఆడపిల్లల మానంకు 5 లక్షలు, ప్రాణంకు 10 లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకొంటారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలులో లేని దిశా చట్టం గురించి పబ్లిసిటీ చేసుకోవడం తగదని, ఆడపిల్లలకు న్యాయం చేయలేకపోతే సీఎం జగన్, హోమ్ మంత్రి సుచరితలు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. మైనర్ బాలిక పై అత్యాచారయత్నంకు పాల్పడిన వారికి కఠినంగా శిక్ష పడేలా చేయాలని, లేని యెడల టీడీపీ నుండి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.