NTV Telugu Site icon

PattabhiRam: గృహ నిర్మాణంపై ప్రభుత్వానివి అసత్య ప్రకటనలు

Pattabhi

Pattabhi

వైసీపీ సర్కారుపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు చేశారు. గృహనిర్మాణంపై మంత్రి జోగి రమేష్ రోగి రమేష్‌లా అసత్యాలు మొరుగుతున్నారని మండిపడ్డారు. గృహనిర్మాణం, ఇళ్ల పట్టాల విషయంలో జగన్ రెడ్డి అండ్ కో కోట్లాది రూపాయలను స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో 7.82 లక్షలకు పైగా పేదలకు పక్కా గృహ నిర్మాణం జరిగిందని అసెంబ్లీలో గత మంత్రి రంగనాథరాజు స్వయంగా వెల్లడించారని గుర్తుచేశారు.

గత మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 60,700 ఇళ్ల నిర్మాణం మాత్రమే జరిగిందని కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారని పట్టాభిరామ్ అన్నారు. పనికి మాలిన ప్రభుత్వం వల్లే గత రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో గృహ నిర్మాణం అధ్వాన్నంగా ఉందని ఆరోపించారు. గత మూడేళ్లలో గృహ నిర్మాణానికి కేటాయించింది కేవలం రూ. 12.23 వేల కోట్లు అయితే ఖర్చు చేసింది రూ. 5. 89 వేల కోట్లు మాత్రమే అని పట్టాభి వివరించారు. గృహనిర్మాణానికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామంటూ అసత్య ప్రకటనలు ప్రభుత్వం ఇస్తోందన్నారు.

యూపీ, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు గత మూడేళ్లలో లక్షలాది ఇళ్లు నిర్మించాయని జోగి రమేష్ తెలుసుకోవాలని పట్టాభి సూచించారు. ఏపీలో జగనన్న కాలనీల నిర్మాణానికి ఇప్పటి వరకూ కేవలం 5.43లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక మాత్రమే ఇచ్చినట్లు సమాచార హక్కు సమాధానం ఉందన్నారు. సీఎం జగన్ మాత్రం 3.10 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తున్నట్లు అసత్య ప్రకటనలు ఇచ్చారని పట్టాభి విమర్శలు చేశారు.

Andhra Pradesh: వాహనదారులకు అలర్ట్.. ఇకపై హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి