ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై టీడీపీ నేతలు మండిపడుతూనే వున్నారు. అసెంబ్లీ జగన్ భజన సభలా మారింది. సభలో మాట్లాడకుండా మా గొంతు నొక్కారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప. కల్తీ సారా,నకీలీ మద్యంపై సభలో చర్చించాలని ఆందోళన చేశాం. ముఖ్యమంత్రి సభలో అవాస్తవాలు చెప్పారు. ఇకనుంచి ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తాం.
సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. కల్తీ సారా మరణాలపై ప్రశ్నిస్తే మమ్మల్ని సస్పెండ్ చేశారు. ప్రతి రోజు మా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి గొంతు నొక్కారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం అన్నారు భవానీ.
సమావేశాల చివరి రోజు కూడా అసెంబ్లీలో కల్తీ నాటుసారాపై చర్చకు అవకాశం ఇవ్వలేదు. మహిళల తాళిబొట్లు తెగిపోయాయని సభలో తాళిబొట్ల ప్రదర్శన పెట్టినా చర్చ చేపట్టకపోగా మాపై ఎదురుదాడికి దిగారు. భర్తల్ని కోల్పోయిన మహిళల బాధ తెలపాలనే తాళిబొట్లు ప్రదర్శించాం. వైసీపీ ఎమ్మెల్సీలు మా చేతిలో తాళిబొట్లు లాక్కుని నేలకేసి కొట్టారన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. 42 మంది ప్రాణాలు ఎందుకు పోయాయో ప్రభుత్వం చట్టసభల్లో సమాధానం చెప్పలేదు. పులివెందులలో కల్తీసారా బయటపడినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
