ఏపీలో ప్రస్తుతం సినిమా టిక్కెట్ల రేట్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎంతోమంది కార్మికులు ఆధారపడ్డ సినిమా థియేటర్ల కంటే వాటి పక్కన ఉండే కిరాణాషాప్ వాళ్లు ఎక్కువ సంపాదిస్తున్నారంటూ హీరో నాని చేసిన కామెంట్లు అధికార పార్టీలో వేడిని పుట్టించాయి. మార్కెట్‌లో ప్రతిదానికి ఎమ్మార్పీ ఉన్నట్లే సినిమా టిక్కెట్లకు కూడా ఎమ్మార్పీ అవసరమని.. ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ రేట్లను పెంచుకుంటామంటే ఎలా అని హీరో నానికి మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. అయితే హీరో నానికి ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలు మద్దతు ఇస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా నాని వ్యాఖ్యలకు మద్దతు ప్రకటించినట్లు కనిపిస్తోంది.
Read Also: చిత్తూరులో మొత్తం 37 థియేటర్ల మూసివేతకు ఆదేశాలు
సినిమా హీరోలను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ సర్కారు పనిచేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. సినిమా వాళ్ల నుంచి కమీషన్లు రావడం లేదనే ప్రభుత్వం సినిమా థియేటర్లపై దాడులు చేయాలని అధికారులను ప్రేరేపిస్తుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా సినిమా టిక్కెట్ల రేట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. మరోవైపు వేల ఎకరాలు దానం చేసిన మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును కొందరు దోపిడీదారులు అవమానిస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినవారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని… అశోక్ గజపతిరాజుపై కేసు పెట్టడం దారుణమని బుద్ధా వెంకన్న అభిప్రాయపడ్డారు.
