Balakrishna: శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో ఆదివారం నాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి బాధాకరమన్నారు. వరద పరిస్థితులను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. స్థానిక నాయకులు. అధికారులతో సమస్యను తెలుసుకుని కలెక్టర్‌తో వరద పరిస్థితిపై సమీక్షించామని బాలకృష్ణ తెలిపారు. కొట్నూరు, శ్రీకంఠాపురం, పూలకుంట సమీపంలో బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించామని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క ప్రజా ప్రతినిధి వచ్చి పలకరించిన పాపాన పోలేదని బాలకృష్ణ మండిపడ్డారు.
Read Also: Balakrishna: నందమూరి వంశంలో మొదటిసారి.. బాలయ్య కూతురు టాలీవుడ్ ఎంట్రీ..?
మొబైల్ అన్న క్యాంటీన్ ద్వారా హిందూపురం పట్టణంలో పేద ప్రజలకు భోజన పంపిణీని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించారు. ఈ ప్రభుత్వంలో భూకబ్జాలు, నేరాలు తప్ప అభివృద్ధి లేదన్నారు. కరోనా విపత్కర సమయంలో ప్రజలకు నిత్యవసరాలు, మందులు పంపిణీ చేసింది తామేనని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో ఎంగిలి మెతుకులు విసిరేస్తూ నిత్యవసర సరుకుల ధరలను పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం అభివృద్ధి కోసం ఎక్కడున్నా పాటు పడుతానని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక గుంత కూడా పూడ్చలేదన్నారు. హిందూపురం ప్రశాంతతకు మారు పేరు అని.. అలాంటి హిందూపురంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదని బాలకృష్ణ హితవు పలికారు. రాజకీయాల్లో జయాపజయాలు దైవ దీనాలు అని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని అభిప్రాయపడ్డారు.
