తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ ‘మహానాడు’ నిర్వహణపై ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం అత్యంత కీలకంగా సాగింది. అమరావతిలో జరిగిన ఈ హైలెవెల్ మీటింగ్‌లో మహానాడు వేదికగా చేపట్టాల్సిన రాజకీయ, సామాజిక తీర్మానాలతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై కూలంకుషంగా చర్చించారు. ఈ ఏడాది నిర్వహించబోయే మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో గ్రాండ్‌గా జరపాలని పొలిట్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించింది.
ఈ ప్రతిష్టాత్మక మహానాడు వేదికగా మొత్తం 20 ముఖ్యమైన తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చించాలని పొలిట్ బ్యూరో డిసైడ్ చేసింది. ప్రాంతాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 10 తీర్మానాలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 4, అండమాన్ నికోబార్‌కు సంబంధించి ఒకటి, రెండు రాష్ట్రాలకు కలిపి 4 ఉమ్మడి తీర్మానాలతో పాటు దేశ రాజకీయ పరిణామాలపై ప్రత్యేక రాజకీయ తీర్మానాలను ఇందులో ప్రవేశపెట్టనున్నారు.
పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు మహిళా సంక్షేమం, వారి సాధికారత కోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలను మహానాడు వేదికగా ప్రత్యేకంగా ప్రస్తావించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. టీడీపీ హయాంలో రూపుదిద్దుకున్న ప్రతి ప్రజా క్షేమ పథకంలోనూ మహిళల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. దాంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా ఈ వేదికను వాడుకోవాలని సూచించారు.
నేటి తరం యువతకు తెలుగుదేశం పార్టీ ఘనమైన చరిత్ర, పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ఆశయాలు, సిద్ధాంతాలు స్పష్టంగా తెలిసేలా మహానాడులో ప్రత్యేక డిజిటల్ ప్రజెంటేషన్స్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే, గత ప్రభుత్వ హయాంలో వైసిపి చేసిన కుట్రలు, రాష్ట్ర ప్రగతికి, సంక్షేమానికి వారు కల్పించిన అడ్డంకులను ప్రజల ముందు ఉంచి ఎండగట్టాలని పొలిట్ బ్యూరో తీర్మానించింది. దీనితో పాటు ‘నా దేశం – నా బాధ్యత’ అనే ప్రత్యేక నినాదంతో సమాజంలో చేపట్టాల్సిన పొదుపు చర్యలపై కూడా ఈ వేదికపై ప్రత్యేక చర్చ జరగనుంది.
మహానాడు కార్యక్రమాన్ని కేవలం ఒక పార్టీ సమావేశంలా కాకుండా పసుపు పండుగలా వైభవంగా నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమం ప్రారంభానికి రెండు రోజుల ముందు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ అభిమానులు, కార్యకర్తలు తమ ఇళ్లపై టీడీపీ జెండాను గర్వంగా ఎగరేయాలని సూచించారు. పార్టీ అగ్రనాయకత్వం మొదలుకుని గ్రామాల్లోని క్షేత్రస్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరినీ ఈ వేడుకలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. అన్ని నియోజకవర్గాల్లోని ప్రధాన క్లస్టర్ల పరిధిలో మహనీయుడు ఎన్టీఆర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించి ఈ మహానాడును ప్రారంభించనున్నారు.
