MLA Quota MLC Elections Results: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం సాధించడంతో సంబరాల్లో ముగినిపోయాయి తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు నివాసంలో సంబరాలు జరిగాయి.. టపాసులు కాలుస్తూ కార్యకర్తల కేరింతలు కొట్టారు.. టీడీపీలో జోష్ నింపిన ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించిన టీడీపీ నేతలు.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. దేవుడి స్క్రిప్ట్ తిరగ రాశాడు. 23 ఓట్లతో గెలిచాం.. ఇవాళ తేదీ 23, ఏడాది 2023 అన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. అన్నింటికంటే ఎక్కువ ఓట్లు మా అభ్యర్థికి వచ్చినా ప్రకటనలో మళ్లీ జాప్యం చేశారన్న ఆయన.. అనవసరంగా పోటీ పెట్టారంటూ కుక్కలన్నీ మొరిగాయి. మా ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టారు. మా వ్యాపారాలు దెబ్బతిసే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసేలా విందు రాజకీయాలు చేశారు. మేం పోటీ పెట్టడం వల్లే ఎమ్మెల్యేలపై జగన్‌కు అమిత గౌరవం పెరిగిందన్నారు..
మేం పోటీ పెట్టడం వల్లే వైసీపీ ఎమ్మెల్యేలకు గౌరవం పెరిగింది. మళ్లీ రీ-కౌంటింగ్ చేయడమేంటీ..? సిగ్గు ఉండాలి కదా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రన్నాయుడు.. ఎన్నికల సంఘంతో చంద్రబాబు మాట్లాడారు. గెలిచినా డిక్లేర్ చేయకపోవడడం ఏంటీ..? వైనాట్ 175 అన్నారు.. కానీ, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అన్నారు. మా అభ్యర్థికి ఎవరు ఓటేశారో మాకు అనవసరం. మాకు ఎవరు ఓటేసారో కూడా తెలీదు. సీఎం జగనే స్వయంగా మాకే ఓటేశారేమో..? అంటూ సెటైర్లు వేశారు. ఓటింగులో పాల్గొనకుండా భవానీ కుటుంబాన్ని వేధిస్తారా..? కింజరాపు వాళ్లు అంటే ఏమనుకున్నారు..? పీక తెగ్గొసుకుంటాం కానీ భయపడం అంటూ వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు.
ఇక, ఎమ్మెల్సీ ఫలితాలపై స్పందించిన బోండా ఉమ.. ఇష్టారీతిన బెదిరించారు.. ప్రలోభాలకు గురి చేశారు.. కానీ, ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఎన్నికలు జరిగినా టీడీపీ విజయం ఖాయం.. పులివెందుల్లో కూడా టీడీపీ విజయం సాధిస్తుంది.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే జగన్‌ను నమ్మని దిక్కుమాలిన పరిస్థితి వచ్చిందన్నారు. మరోవైపు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. మేం ఇద్దర్ని నిలబెట్టి ఉంటే.. ఇద్దరం గెలిచే వాళ్లం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండానే వైసీపీ ఎమ్మెల్యేలు మాకు ఓటేశారన్న ఆయన.. కానీ, మేం మా సంఖ్యా బలానికి అనుగుణంగానే ఒక్క అభ్యర్థినే నిలబెట్టాం. పట్టభద్రుల ఎన్నికల్లో లబ్దిదారులు లేరన్నారు.. ఇప్పుడూ అదే మాట చెబుతారా..? అని ప్రశ్నించారు.. మూడు రోజుల నుంచి రాష్ట్రంలో అరాచకం జరిగింది. మా ఎమ్మెల్యేలను బెదిరించారు. సిగ్గు లేకుండా వైసీపీ వ్యవహరించింది. ఇంకా కొందరు ఎమ్మెల్యేలు భయపడి వైసీపీకి ఓటేశారని తెలిపారు నక్కా ఆనందబాబు.
ఇక, విశాఖ టీడీపీ కార్యాలయంలో ఎన్నికల విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, కేక్ కట్ చేసిన గంటా.. టీడీపీ పడిలేచిన కెరటం అన్నారు. వైసీపీ సెమీ ఫైనల్స్, ప్రీ ఫైనల్స్ అన్నింటిలోనూ ఓటమి పాలైంది.. వైసీపీ పతనం మొదలయ్యింది. దీనిని ఆపే శక్తి సీఎం వైఎస్ జగన్ కు లేదన్నారు. వైఎస్ జగన్ అహంకారానికి ఈరోజు దేవుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా అయ్యిందన్న ఆయన.. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు టీడీపీ గాలి బలంగా వీస్తుంది.. దిక్కులతో సంబంధం లేకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు దుమ్ముదులిపారని పేర్నొన్నారు గంటా శ్రీనివాసరావు.