ఫిస్కల్ కౌన్సిల్ అవసరం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులన్నీ దుబారా చేశారని, పట్టపగలే ప్రజాధనాన్ని నిలువుదోపిడీ చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. అందుకే ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఆర్ధిక నిపుణులు పేర్కొన్నట్లుగా ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు ఏపీలో తక్షణావశ్యకం ఉందన్నారు. రాష్ట్రంలో గతితప్పిన ఆర్ధిక పరిస్థితిని మళ్లీ గాడిలోకి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణపై గ్రీన్ పేపర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ఆర్ధిక నిర్వహణ బాగుందని చెప్పడం నిజాలను కప్పెట్టడమేనాని, టీడీపీ హయాంలో వృద్దిరేటు 10.22 శాతం ఉంటే.. దాన్ని మైనస్ 2.58 శాతానికి రివర్స్ చేశారని ఆయన విమర్శించారు.
సంక్షేమంలో ఏపీ ముందుందని చెప్పడం తుపాకీ రాముడి కోతలేనాని ఆయన మండిపడ్డారు. సంక్షేమమే బాగుంటే డీబీటీల్లో ఏపీ 19వ స్థానంలో ఎందుకుంది..? అని ఆయన ప్రశ్నించారు. ఆర్ధిక అసమానతలు రాష్ట్రంలో 34 శాతం నుంచి 43 శాతానికి ఎందుకు పెరిగాయి..? మూలధన వ్యయం రూ 19,976 కోట్ల నుంచి రూ. 14 వేల కోట్లకు ఎందుకు పడిపోయింది..? డీబీటీ కింద పేదల సంక్షేమ పథకాలెన్ని రద్దు చేశారో బుగ్గన చెప్పాలి..? ప్రభుత్వ పథకాల లబ్ది నుంచి ఎంత మంది పేదలను తప్పించారో చెప్పాలి. ఇది స్పష్టంగా ఎఫ్ఆర్బీఎం పరిమితులను ఉల్లంఘించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.