Site icon NTV Telugu

జగనన్న గోరుముద్ద పథకంలో భారీ అవినీతి: టీడీపీ నేత పట్టాభి

TDP Leader Pattabhi

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. జగనన్న గోరుముద్ద పథకంలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని పట్టాభి ఆరోపించారు. ఈ పథకంలో 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని.. ఇవేమీ జగన్ తన జేబులో నుంచి తీసి ఇస్తున్న డబ్బులు కావన్నారు. అలాంటి కేంద్ర ప్రభుత్వ నిధులను ఏపీ సర్కారు పక్కదారి పట్టిస్తోందన్నారు. చిక్కీలు సరఫరా చేసే కేంద్ర కంపెనీని దిక్కుమాలిన కారణాలు చెప్పి డిస్ క్వాలిఫై చేశారని పట్టాభి విమర్శించారు. దీనిపై సదరు కంపెనీ కోర్టుకు వెళ్లినా బెదిరింపులకు గురిచేసి పిటిషన్‌ను వెనక్కి తీసుకునేలా చేశారని మండిపడ్డారు.

Read Also: లోకేష్‌కి కాలం దగ్గర పడింది… ఇకపై ఏదీ రాదు: విజయసాయిరెడ్డి

పిల్లలకు సరఫరా చేసే చిక్కీల విషయంలో కమిషన్‌ల కోసం రాష్ట్రపతి నివాసానికి సరఫరా చేసే కంపెనీపై వేటు వేయడం దారుణమని పట్టాభి ఆరోపించారు. పిల్లల దగ్గరకు వెళ్లి మేనమామ అని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని.. పిల్లలు ఈరోజు ఆయన అసలు రంగును అర్థం చేసుకున్నారని.. ఆయన మేనమామ కాదు.. దొంగమామ అని వాళ్లే చెప్తున్నారని పట్టాభి ఎద్దేవా చేశారు. చిక్కీల విషయంలో సుమారు రూ.200 కోట్ల స్కాం జరుగుతోందని పట్టాభి విమర్శలు చేశారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి వైసీపీ ప్రభుత్వం దోచుకుంటోందని… ఓ వైపు ఉద్యోగులు తమ జీతాల కోసం ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడంలేదన్నారు. పీఆర్సీ వ్యవహారాన్ని ఏపీ ప్రజలు మార్చి పోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో కొత్త జిల్లాలను తెరపైకి తీసుకువచ్చారని నిప్పులు చెరిగారు. రివర్స్ టెండరింగ్ ద్వారా తనకు ఇష్టం వచ్చినట్లు టెండరింగ్‌ పంపకాలకు జగన్ ప్రభుత్వం పాల్పడుతోందని పేర్కొన్నారు.

Exit mobile version