Budda Venkanna: కుప్పంలో చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకునే యత్నం నిరసిస్తూ విజయవాడలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. వైసీపీ అజెండా అమలు చేసే పోలీసుల్ని చొక్కాలు ఊడతీసి కొడతామని హెచ్చరించారు. చంద్రబాబు కుటుంబాన్ని అంతమొందించే లక్ష్యంతో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులందరూ వైసీపీ యూనిఫామ్ వదిలి ఖాకీ చొక్కాలు వేసుకుని ప్రజల భద్రత కోసం పనిచేయకుంటే తిరగబడే రోజులొస్తాయన్నారు. అంతగా చేతకాకుంటే పోలీసు శాఖకు నాలుగు రోజులు సెలవు ప్రకటిస్తే.. తామూ, వైసీపీ తేల్చుకుంటామని స్పష్టం చేశారు. గౌతమ్ సవాంగ్‌ను జగన్ ఎలా వాడుకుని వదిలేశాడో పోలీసులు గ్రహించాలని హితవు పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబుని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబుకు భద్రత పెంచినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అరాచకాలకు పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: ఈ అధ్యయన శాస్త్రాలను ఏమంటారో మీకు తెలుసా?
అటు చంద్రబాబు, లోకేష్ బయటకు వస్తే చాలు జగన్మోహన్‌రెడ్డి వెన్నులో వణుకు పుడుతోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరా ఎద్దేవా చేశారు. చంద్రబాబు భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోందని తెలిపారు. ఓ ఫ్యాక్షనిస్ట్ మాదిరిగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదని పేదలందరూ ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని నాగుల్ మీరా ఆరోపించారు.