Site icon NTV Telugu

Amarnath Reddy: అధికార బలంతో టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తారా? అన్నాక్యాంటీన్‌ను ధ్వంసం చేసిన వారిపై చర్యలేవి?

Amarnath Reddy

Amarnath Reddy

Amarnath Reddy: ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు పర్యటనలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నందుకు 59 మందిపై కేసులు నమోదు చేశారని.. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలను ప్రభుత్వం అరెస్ట్ చేయించడం భావ్యం కాదన్నారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అక్రమంగా టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడం తగదన్నారు.

మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుపై హత్యాయత్నం కేసుతో పాటు మరో రెండు కేసులు నమోదు చేశారన్నారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని.. ఇంతలా విధ్వంసం సృష్టించి అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. వైసీపీ వ్యవహార శైలిపై ప్రజలు ఛీ కొడుతున్నారని అమర్నాథ్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజా అభిప్రాయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకోవాలని.. అన్న క్యాంటీన్ కూల్చిన కూతవేటు దూరంలో జిల్లా ఎస్పీ కూర్చొని కంట్రోల్ చేయలేకపోయారని అమర్నాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Read Also: Lying Down Championship: 60 గంటలు నిద్రపోయాడు.. రూ.27వేలు గెలుచుకున్నాడు

అటు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా వైసీపీ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో నవరత్నాల పేరుతో జగన్ ప్రభుత్వం దోచుకుంటోందని.. సీఎం జగన్ బరితెగించి రాజకీయాలు చేస్తున్నారని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలో రాష్ట్రంలో ఉన్న రజకులు సమావేశం కావడం అభినందనీయమని.. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. వెనుకబడిన కులాల సమస్యలను అర్థం చేసుకుని ఆదరించిన పార్టీ టీడీపీ అని తెలిపారు. కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబును అడ్డుకోవడం దారుణమన్నారు. సుమారు 80 మందిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం అప్రజాస్వామికమని ఆరోపించారు. ఎంపీ బట్టలు ఊడదీసుకొని వస్తే దానిపై ప్రభుత్వం స్పందించలేదని.. ప్రజాస్వామ్యహితంగా కార్యక్రమలు చేస్తున్న టీడీపీని అడ్డుకోవడం శోచనీయమన్నారు. రజకులు శ్రేయస్సు కోరేది ఒక్క టీడీపీ మాత్రమే అని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Exit mobile version