రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులు రెఫరెండంగా వచ్చే ఎన్నికలకు వెళ్లామంటున్న వైసీపీ ప్రభుత్వం.. దమ్ముంటే ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో డిమాండ్ చేయాలని టీడీఎల్పీలో నిర్ణయించారు. జగన్‌కు అంత నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ సవాల్ విసిరింది. ఈ సందర్భంగా టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక రాజధాని విషయంలో జగన్ మాట తప్పారని ఆరోపించారు. మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని జగన్ ఎన్నికలకు వెళ్లాలన్నారు. మూడు ముక్కల రాజధానిపై జగన్‌కు నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి సవాల్ విసరబోతున్నామని తెలిపారు. సభ సజావుగా జరగకూడదని ప్రభుత్వ ఆలోచన అని.. ప్రభుత్వ మూడున్నరేళ్ల వైఫల్యాలను ఎండగడతామన్నారు.
ఏపీలో యువత నిర్వీర్యం అయ్యిందని.. నిరుద్యోగం పెరిగిందని నిమ్మల రామానాయుడు విమర్శించారు. జగన్ పాలనలో ప్రజలను పన్నులతో బాదేస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వంలో వరి వేసుకుంటే ఉరే అనే పరిస్థితుల్లోకి రైతులు వెళ్లారన్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలు పెరిగిపోయాయన్నారు. వైసీపీ నేతల ఇసుక, మద్యం దొపిడీకి అడ్డే లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను సమావేశాల్లో ఎండగట్టి తీరుతామన్నారు.
Read Also: Tamilnadu: వైరల్ వీడియో.. ఓ సారూ.. నువ్వు ఎంతటి రసికుడివో తెలిసెరా..!!
కాగా అసెంబ్లీ సమావేశాల్లో 15 అంశాలు లేవనెత్తాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అమరావతిలో అక్రమాలంటూ సీఐడీ తాజా అరెస్టులపైనా టీడీఎల్పీలో చర్చ జరిగింది. రైతుల పాదయాత్ర సమయంలో కేసులు ఉద్దేశపూర్వకమని టీడీఎల్పీ ఆరోపించింది. లావాదేవీలే జరగని అంశాల్లో అక్రమ కేసులు ఏంటని మండిపడింది. తప్పుడు సెక్షన్లు పెట్టిన సీఐడీ అధికారులపై ప్రైవేటు కేసులు పెట్టే అంశంపై టీడీపీ కసరత్తు చేస్తోంది. భారీ వర్షాలు-వరదలకు పంట నష్టం.. టిడ్కో ఇళ్ల పంపిణ గృహ నిర్మాణం అంశాలపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలని టీడీపీ భావిస్తోంది. దళితులు, మైనార్టీలపై దాడులు, రాష్ట్రంలో క్షీణించిన శాంత్రి భద్రతలు తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టాలని యోచిస్తోంది. బాక్సైట్ అక్రమ మైనింగ్, మద్యం కుంభకోణం, నిత్యావసర ధరల పెరుగుదల, పోలవరం, అమరావతి నిర్మాణాల్లో నిర్లక్ష్యం అంశాలపైనా ప్రస్తావిస్తామని అంటోంది. అస్తవ్యస్తంగా రహదారులు, లేపాక్షి భూములు, విభజన హామీల అమలు, పంచాయితీల నిధుల మళ్లింపు, శాండ్ మైనింగ్ వంటి అంశాలపై ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని టీడీఎల్పీ నిర్ణయించింది.
