Site icon NTV Telugu

వైసీపీ నేతల వ్యాఖ్యలపై నిరసన.. పలు చోట్ల టీడీపీ ఆందోళనలు

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ఓ చర్చలో భాగంగా వైసీపీ నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఏపీలోని పలుచోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అనంతపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఈ మేరకు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని వెళుతున్న క్రమంలో మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాహనాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యను సైతం టీడీపీ నేతలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్, అంబటి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Read Also: చంద్రబాబు గ్లిజరిన్ పెట్టుకుని ఏడ్చాడు: మంత్రి కొడాలి నాని

అటు గుంటూరు, విజయవాడ సహా పలు ప్రాంతాలలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోవైపు చంద్రబాబుపై వైసీపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలతో అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్తలు మనస్తాపానికి గురయ్యారు. అనంతపురంలో ఇద్దరు పురుగుల మందు తాగారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

Exit mobile version