Site icon NTV Telugu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు.. సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ

Amaravati Capital Case

Amaravati Capital Case

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసుపై ఉత్కంఠ నెలకొంది.. దానికి కారణం.. నేడు సుప్రీకోర్టులో అమరావతి రాజధాని కేసుపై విచారణ జరగనుంది.. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మరోవైపు.. హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అమరావతి రైతులు.. అయితే, ఈ రెండు పిటిషన్లను న్యాయమూర్తి కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది.. ఇక, అమరావతి రాజధాని చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం.. వైఎస్‌ జగన్ ప్రభుత్వ మూడు రాజధానుల గురించి తమకు తెలియని పేర్కొంది.. మరోవైపు.. విమర్శలు ఎదురైనా మూడు రాజధానులపై ముందుకు కదులోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌.. త్వరలోనే వైజాగ్ కు మకాం మార్చుతానని సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.. ఈ నేపథ్యంలో నేటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read Also: School Shooting: స్కూల్లో ఆకస్మికంగా కాల్పులు.. విద్యార్థులు సహా ఆరుగురు మృతి

కాగా, హైకోర్టు ఇచ్చిన తీర్పును యథావిథిగా అమలు చేయాలని రైతులు పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. వీటిపై మార్చి 28న విచారణ జరపనున్నట్టుగా సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో పేర్కొంది.. అయితే ఇందుకు సంబంధించిన విచారణను త్వరగా పూర్తిచేయాలని ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టుకు విన్నవించింది.. అయితే, రాజ్యాంగపరమైన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయని గతంలోనే జస్టిస్ కేఎం జోసెఫ్ పేర్కొన్నారు. ఈ కేసు చాలా పెద్దదని, విచారణ చేపడితే దానికి సార్థకత ఉండాలని వ్యాఖ్యానించారు. తమ వినతిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతినివ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు కేఎం జోసెఫ్ ధర్మాసనం నిరాకరించింది. ఇక, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజధాని అమరావతిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు హైకోర్టు ఇచ్చిన గడువుపై సుప్రీంకోర్టు గతంలో స్టే విధించింది. అయితే హైకోర్టు తీర్పులోని మరికొన్ని అంశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో.. ఇవాళ్టి విచారణ ఎలా జరగనుంది? అనేది ఉత్కంఠగా మారింది.

Exit mobile version