Site icon NTV Telugu

GO Number 1: జీవో నంబర్‌1పై ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేం..!

Supreme Court

Supreme Court

GO Number 1: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ.. జీవో నంబర్‌ 1 విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది భారత అత్యున్నతన్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై సభలు, రోడ్డుషోలు, సమావేశాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. అయితే, హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.. ఈ నెల 23వ తేదీన హైకోర్టులో విచారణ ఉంది.. హైకోర్టు సీజే విచారణ జరపాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.. కాగా, బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలకు నియంత్రణ ఉం­డేలా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1పై స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది..

Read Also: AP Budget Session: వచ్చే నెలలో ఏపీ బడ్జెట్‌ సమావేశాలు..?

ఈ జీవోపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఈ జీవో ఉందని ఆరోపించారు. రామకృష్ణ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, జీవోను జనవరి 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది… ఇక, తదుపరి విచారణ జనవరి 23కి తేదీకి వాయిదా వేసింది. కానీ, జీవో విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం ఈ జీవో జారీచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో కొందరు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయితీ రాజ్ రోడ్లు, మున్సిపల్ రోడ్లపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ ఈ జీవోను విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తోంది.. ప్రజలకు ఇబ్బందులు కల్గించకూడదన్న ఉద్దేశంతో.. ప్రజల ప్రాణాలు కాపాడడానికే జీవో జారీ చేశామని, ప్రజలకు అసౌకర్యం కల్గని ప్రాంతాల్లో సభలు నిర్వహించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.. కానీ, నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీవోలో పేర్కొంది. హైకోర్టు స్టేను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినా.. మళ్లీ హైకోర్టు విచారణకే సూచించింది సుప్రీంకోర్టు.. దీంతో.. హైకోర్టులో విచారణ ఎలా ఉండబోతోంది? ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.

Exit mobile version