Polavaram Project: ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు నెలకొందని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులు, సంస్థలు పిటిషన్‌లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌లను స్వీకరించి విచారణ చేపట్టింది. పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి పోలవరం నిర్మాణం చేపట్టినట్లు పిటిషనర్లు ఆరోపించారు. పర్యావరణ అనుమతులకు, ప్రాజెక్టు నిర్మాణానికి పొంతన లేదని కోర్టుకు వివరించారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పోలవరం ప్రాజెక్టుపై నివేదిక ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖను కోరింది. ప్రాజెక్టు పర్యావరణ అంశాలపై పరిశీలించాలని జలశక్తి శాఖను ఆదేశించింది.
Read Also: CM Nitish Kumar: ప్రధాన మంత్రి కావాలనే కోరిక నాకు లేదు..
మరోవైపు పోలవరంపై తలెత్తుతున్న అభ్యంతరాలపై ముఖ్యమంత్రులు, సీఎస్‌ల స్థాయిలో చర్చలు జరపాలని సుప్రీంకోర్టు సూచించింది అభ్యంతరాలను పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికింది. ఈ కేసులో అదనపు పత్రాలు సమర్పించేందుకు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కోరడంతో సుప్రీంకోర్టు అనుమతులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం ఆలయం ముంపునకు గురైందని.. ఈ అంశంపై విచారణ చేపట్టాలని తెలంగాణ బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
