Site icon NTV Telugu

Sunil Deodhar: సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదు

Sunil Deodhar

Sunil Deodhar

Sunil Deodhar: ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడారు. 2024లో జరిగే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదన్నారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని చేదు అనుభవాలు చవిచూశామని తెలిపారు. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే టీడీపీతో పొత్తు పెట్టుకోరాదని నిర్ణయించినట్లు తెలిపారు. రోడ్డు మ్యాప్ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తాము అంతర్గతంగా చర్చిస్తామని సునీల్ దేవధర్ చెప్పారు. రోడ్డు మ్యాప్ అంశంపై మీడియాలో మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.

Read Also: Amaravathi: అమరావతికి శంకుస్థాపన జరిగి నేటితో ఏడేళ్లు.. ఫోటో పోస్ట్ చేసిన చంద్రబాబు

మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుపై విమర్శలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారాన్ని తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దేవధర్ వ్యాఖ్యానించారు. పార్టీలో ఈ తరహా అసంతృప్తులు సహజమేనని చెప్పారు. ఇవేమీ అంత పెద్దగా పట్టించుకునే వ్యాఖ్యలు కూడా కాదన్నారు. అటు టీడీపీ, వైసీపీ పార్టీలు దొందూ దొందే అని సునీల్ దేవశర్ అభిప్రాయపడ్డారు. ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలు అని, అవినీతి పార్టీలు అని ఆయన ఆరోపించారు. కాగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టతకు కేంద్ర ప్రభుత్వ సాయం, కోట్లు ఖర్చు చేసి గొప్పగా ప్రచారం చేస్తున్న ‘నాడు – నేడు’ ఫలాలను అందుకునే అదృష్టం విద్యార్థులకు లేకుండా పోయిందని సోము వీర్రాజు విమర్శలు చేశారు. మౌళిక వసతులు అనే పదానికి అర్థం తెలియని ముఖ్యమంత్రి పాలన ఇది అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Exit mobile version