విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటన పై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. 14 ఏళ్లు ఉన్న బాలిక భవనం మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం మనసును కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వినోద్ జైన్ ఎంత దారుణమైన లైంగిక వేధింపులకు గురిచేసాడో, మానసిక వేదనకు గురిచేసాడో బాలిక ఆత్మహత్యను బట్టి అర్థమవుతుందన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను హోంమంత్రి సుచరిత ఆదేశించారు. బాధిత బాలిక కుటుంబసభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ మంత్రి సుచరిత హామీ ఇచ్చారు. ఈ ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాలిక రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా నిందితుడు వినోద్ జైన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు: బండి శ్రీనివాసరావు
టీడీపీ నాయకుడు మైనర్ బాలికతో అత్యంత అమానుషంగా వ్యవహరించినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు హోం మంత్రి సుచరిత. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు ఎంతటి దుర్మార్గాలకు పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఒక మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకొని కొట్టడం, కాల్ మనీ పేరుతో టీడీపీ నాయకులు దూరాఘతాలకు పాల్పడటం, మహిళను వివస్త్రను చేసి కొట్టడం లాంటి ఎన్నో ఘటనలు గతంలో చూశామని మంత్రి వెల్లడించారు. స్వయంగా చంద్రబాబు నాయుడు ఆడబిడ్డల పుట్టుక గురించి మాట్లాడటం, నారా లోకేష్ మహిళల గురించి అవహేళనగా మాట్లాడటం చూశామని హోం మంత్రి సుచరిత అన్నారు.
Read Also: ఏపీలో కొత్తగా 10,310 కరోనా కేసులు
టీడీపీ ముఖ్య నాయకులు మహిళలను చిన్న చూపుతో చూడటం వల్లనే వినోద్ జైన్ లాంటి నాయకులు తయారవుతున్నారని హోం మంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ గారు బాలిక ఆత్మహత్య ఘటన పై తీవ్రంగా స్పందించారన్నారు.మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడే వారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని సీఎం జగన్ గారు ఎన్నో సందర్భాలలో పేర్కొన్న విషయాన్ని హోంమంత్రి గుర్తుచేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్షించే పూర్తి స్వేచ్ఛ ను పోలీసు శాఖకు సీఎం కల్పించారని హోం మంత్రి తెలిపారు. బాలిక మరణానికి కారణమైన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ కు కఠిన శిక్ష పడేలా పోలీసు ఉన్నతాధికారులను హోం మంత్రి సుచరిత ఆదేశించారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను విమర్శించడం మానుకోవాలని హోం మంత్రి సుచరిత సూచించారు.
