NTV Telugu Site icon

AP Free Gas Scheme: రేపు శ్రీకాకుళంలో సీఎం పర్యటన.. ఉచిత గ్యాస్‌ పథకం ప్రారంభం..

Cbn

Cbn

AP Free Gas Scheme: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.. రేపు సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో మహిళలకు దీపం పథకాన్ని ప్రారంభించనున్నారు.. మొదట 833 రూపాయలు డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు కస్టమర్ల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీపావళి పండుగ రోజు నుంచి ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ ప్రారంభించనున్నారు.. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఏపీ సర్కార్ ఇవ్వనుంది. దీంతో.. ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్‌ పథకానికి గ్యాస్ కనెక్షన్‌తో పాటు రేషన్ కార్డు, ఆధార్‌ కార్డును ప్రాతిపదికగా నిర్ణయించారు. పథకంలో భాగంగా వినియోగదారులు తొలుత సిలిండర్ కోసం నగదు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన రెండు రోజులలోపే వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమచేస్తారు. డీబీటీ ద్వారా ప్రభుత్వం నిధులు జమ చేయనుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు ఏడాదికి 2,684 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

Read Also: HIV cases: వామ్మో ‘‘పులిరాణి’’.. ఒక మహిళ నుంచి పలువురికి హెచ్ఐవీ..?

ఇప్పటికే దీనికి సంబంధించిన గ్యాస్‌ బుకింగ్స్‌ ప్రారంభమైన విషయం విదితమే.. అయితే, ఈ పథకం లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌ చెబుతూ.. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. మొదటి విడతకు అయ్యే ఖర్చు 894 కోట్ల రూపాయల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సచివాలయంలో.. హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ఈ సబ్సిడీ మొత్తాన్ని అందించారు సీఎం చంద్రబాబు.. ఇక, శ్రీకాకుళం పర్యటనకు వెళ్లనున్న క్రమంలో కొద్దిసేపు విశాఖ విమానాశ్రయంలో ఆగనున్నారు సీఎం చంద్రబాబు.. ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి విశాఖపట్నానికి చేరుకోనున్న ఆయన.. విశాఖ నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్తారు.. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఉచిత సిలిండర్ డెలివరీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, విజయవాడ వెళతారని పార్టీ వర్గాలు చెబుతున్నారు..

Read Also: Amaran Review: శివ కార్తికేయన్ అమరన్ రివ్యూ

రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం ఇదుపురం గ్రామంలో సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.. మొదటి సిలిండర్ డెలివరీ ఇవ్వబోతున్నారు సీఎం చంద్రబాబు.. అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.. ఇప్పటికే సోంపేట చేరుకున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు..