Penukonda Tragedy: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని గొల్లపల్లి రిజర్వాయర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవుల సందర్భంగా విహారయాత్రకు వెళ్లిన ఐదుగురు మహిళలు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సరదాగా గడిపేందుకు రిజర్వాయర్లోకి దిగిన వారు.. నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే పెనుకొండ దర్గా పేటకు చెందిన కొంతమంది మహిళలు కలిసి గొల్లపల్లి రిజర్వాయర్కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ నీటి లోతు తక్కువగా ఉంటుందని భావించి సరదాగా ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. అయితే, వారు ఊహించిన దానికంటే లోతు ఎక్కువగా ఉండటంతో ఐదుగురు మహిళలు నీటిలో మునిగిపోయారు. ఘటనను గమనించిన సమీపంలోని రైతులు వెంటనే నీటిలోకి దిగి వారిని బయటకు తీసుకొచ్చారు. అయితే, అప్పటికే ఐదుగురూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనలో మహీం (16), హసీనా, పుష్పలత, గాయత్రమ్మ, అశ్వణి మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న పెనుకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గొల్లపల్లి రిజర్వాయర్లో ఐదుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన మహిళలు ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: మంత్రి సవిత
ఐదుగురు మహిళలు రిజర్వాయర్లో మునిగి మృతి చెందడంపై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతోషంగా గడపాల్సిన సమయంలో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం బాధాకరమని అన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విహారయాత్రలకు వెళ్లే సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లోని చెరువులు, రిజర్వాయర్ల వద్ద నీటి లోతుపై అవగాహన లేకుండా నీటిలోకి దిగవద్దని పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు పర్యాటక ప్రాంతాల్లోని చెరువులు, రిజర్వాయర్ల సమీపంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

