Madakasira: మడకశిర జనసేన అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామం… నామినేషన్ తిరస్కరణతో మారిన సీన్‌..

Madakasira

Madakasira

Madakasira: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు హీట్‌ పెంచుతున్నాయి.. ఓవైపు అభ్యర్థులు.. మరోవైపు ప్రత్యర్థులు ఇలా ఒక్కోపార్టీకి ఒక్కో సవాల్‌లా ఉంది పరిస్థితి.. ఇక, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జనసేన పార్టీ తరఫున చైర్‌పర్సన్ అభ్యర్థిగా శారదమ్మను ఖరారు చేశారు. గుండుమల తిప్పేస్వామి సోదరుడు, న్యాయవాది రాధాకృష్ణ సతీమణి అయిన శారదమ్మకు జనసేన పార్టీ బీ ఫారం అందజేశారు.

అయితే, జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎస్‌.ఇ. శ్రీనివాసులు నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో పార్టీ ప్రత్యామ్నాయ అభ్యర్థిగా శారదమ్మను ఎంపిక చేసింది.. శ్రీ సత్యసాయి జిల్లా జనసేన అధ్యక్షుడు చిలకం మధుసూదన రెడ్డి, నవీన్ నిశ్చల్ శారదమ్మకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు కూడా జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు మడకశిర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.