ఏపీ సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు. ధాన్యానికి మద్దతు ధర లేదని.. కొనుగోళ్లలో ఘరానా మోసం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అధికారులతో కుదిరిన ఒప్పందాన్ని మాత్రం దర్జాగా అమలు చేస్తూ మిల్లర్లు రైతుల నోట్లో దుమ్ము కొడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనేక వేదికల మీద ఈ విషయం చెబుతోన్నా ప్రభుత్వం మొద్దు నిద్ర పోయిందన్నారు.
YSR Sanchara Pashu Arogya Seva: అంబులెన్స్ సేవలు ప్రారంభించిన జగన్
వైసీపీకి చెందిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ధాన్యం మాఫియాపై చేసిన వ్యాఖ్యలకైనా ప్రభుత్వం సమాధానం చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. రైతులను దోచుకుంటోన్న మిల్లర్లు, అధికారుల లెక్క తేలాల్సిందేనన్నారు. ధాన్యాన్ని రీమిల్లింగ్ చేసే మాఫియాపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఈ-క్రాప్ నమోదులోనే కుంభకోణం జరుగుతోందని చెప్పారని.. ఏకంగా 17 వేల మంది రైతుల ఖాతాలలో చిరునామాలు గల్లంతయ్యాయని సోము వీర్రాజు ఆరోపించారు. సొంత పార్టీ ఎంపీ సూచనలనైనా పరిగణనలోకి తీసుకోవాలని సోము వీర్రాజు కోరారు. 75 కిలోల ధాన్యం బస్తాకు రూ. 1455 చెల్లించాల్సి ఉండగా రూ. 1200 కంటే తక్కవ చెల్లిస్తున్నారని.. మిల్లర్లు వద్దకు మొత్తం ధాన్యం వెళ్లే విధంగా క్షేత్రస్థాయిలో అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు. ఈ దర్జా దోపిడీ వెనుక ఎవరు ఉన్నారన్నది దర్యాప్తు సంస్ధలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లల్లో దోపిడీ విషయం తేలాలంటే సీఎం జగన్ నోరు విప్పాలని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రైతులకు పక్కాగా అందేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.